Telangana Delegation Visit South Korea : దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రాష్ట్ర బృందం మూడో రోజు ఇంచియాన్ నగరంలోని స్మార్ట్ సిటీలను సందర్శించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి స్మార్ట్ సిటీ వ్యవస్థను పరిశీలించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సహకారం అందించే కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీని సందర్శించారు. అక్కడి అధికారులతో సమావేశమై క్రీడాకారుల్నిమెరికల్లా తీర్చిదిద్దే విధానాల్ని తెలుసుకున్నారు.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం పర్యటన మూడో రోజు కొనసాగింది. దక్షిణ కొరియాలోని అత్యంత ప్రతిష్ఠాత్మక స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో ఒకటైన ఇంచియాన్ స్మార్ట్ సిటీని సందర్శించారు. సాంగ్డో ప్రాంతంలో దాదాపు 15వందల ఎకరాల్లో పర్యావరణ అనుకూల విధానాలతో ఈ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. నగరపాలక సంస్థ డైరెక్టర్ యుంగ్ జే సన్‌తో పాటు సభ్యులు, అక్కడి అధికారులతో సమావేశమయ్యారు. కమాండ్ సెంటర్ ద్వారా స్మార్ట్ సిటీల పర్యవేక్షణను బృందం పరిశీలించింది.
కొరియాకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇంచియాన్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో అత్యాధునిక సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీని కొరియా వినియోగిస్తోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సిటిగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, పర్యాటక హబ్‌గా మారింది. పర్యటనలో భాగంగా కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సందర్శించారు.
ఈ యూనివర్శిటీ సహకారంతో మన రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్శిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఒలింపిక్ సహా ఇతర ప్రతిష్టాత్మక టోర్నీల్లో దక్షిణ కొరియా సాధించే పతకాల్లో కొరియన్ స్పోర్ట్స్ వర్శిటీ వాటా దాదాపు 40శాతం వరకు ఉంది. ఈ స్ఫూర్తితోనే మన రాష్ట్రంలోనూ క్రీడాకారులు పతకాలు సాధించేలా యంగ్ ఇండియా వర్శిటీలో శిక్షణ ఇచ్చేలా కొరియన్ స్పోర్ట్స్ వర్శిటీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో సియోల్‌లో ఉన్న రాష్ట్ర బృందం ఆ వర్శిటీని సందర్శించి శిక్షణతో పాటు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర అంశాలను పరిశీలించారు.
దక్షిణ కొరియా సరిహద్దు ప్రాంతమైన డీఎం జోన్‌ను సియోల్‌లో పర్యటిస్తున్న జర్నలిస్టులు పరిశీలించారు. ఉత్తర, దక్షిణ కొరియాల సరిహద్దు భాగాన్ని సందర్శించి రక్షణ, ఇతర అంశాలను పరిశీలించారు. అనంతరం ఇండియన్ ఎంబసీని సందర్శించి అధికారులతో సమావేశమై అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.
సౌత్ కొరియాలోని డిమిలిటరైజేషన్ జోన్‌ను సందర్శించిన తెలంగాణ టీమ్
హాన్ నది తరహాలో మూసీ సుందరీకరణ - అందర్నీ ఒప్పించి, మెప్పించే పునరుద్ధరణ'