Araku Valley View in Hot Air Balloon : అరకు అంటేనే ప్రకృతి ప్రేమికులకు భూతల స్వర్గం. అరకును ఆంధ్రా ఊటీగా పిలుస్తారు. ఇక్కడకు వెళితే ఊటీ వెళ్లినంత ఫీలింగ్ వస్తుంది. అరకు ప్రయాణం ప్రారంభం నుంచి అరకు ఘాట్ రోడ్డు పాములా వంపులు తిరుగుతూ, రహదారి పక్కనే పెరిగే కాఫీ, టీ మొక్కల సువాసనలో ముందుకు వెళుతూ ఉంటే ఆ ఘాట్ రోడ్డు నుంచి కిందకు చూస్తే మేఘాల్లో ఉన్నామని అనిపిస్తుంది. అలా పైకి వెళ్లే కొలది ఆదివాసీల సాంప్రదాయాలను చూస్తూ ఉండిపోవచ్చు. రంగు రంగులుగా మెరిసే బొర్రా గుహలు, చాపరాయ జలపాతం అందాలు, పచ్చని ప్రకృతి మధ్య మనల్ని మనమే మరిచిపోయేంత అనుభూతిని ఇస్తుంది. అరకు పర్యాటకాన్ని మరింత వృద్ధి చెందించేందుకు అక్కడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చు పెడుతోంది.
హాట్ బెలూన్లో అరకు లోయ వీక్షణ : ఈ క్రమంలో అరకు లోయ ప్రకృతి అందాలను ఆకాశం నుంచే వీక్షించేందుకు పర్యాటకులకు ప్రభుత్వం గుడ్ న్యూస్నే చెప్పింది. ఆకాశం నుంచి అంటే ఏదో విమానంలో తీసుకెళ్లి లేకపోతే హెలికాప్టర్లో కాదు. హాట్ ఎయిర్ బెలూన్లో తీసుకెళ్లి భూమికి 300 మీటర్ల ఎత్తులో ఉంచి అరకు లోయ అందాలను తమ కెమెరాల్లో బంధీ చేసుకొని ఆ తియ్యని గుర్తులను జీవితాంతం తమలో ఉండిపోయే విధంగా నింపుతున్నారు. పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్ చొరవతో హాట్ ఎయిర్ బెలూన్ను అరకు లోయ అందాలను చూడడానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం పద్మాపురం ఉద్యానంలో జరిగాయి. ఈ ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయింది.
దీంతో మంగళవారం నుంచి హాట్ ఎయిర్ బెలూన్ పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. పద్మాపురం ఉద్యానంలో ఈ బెలూన్లో పర్యాటకులు షికారు చేస్తున్నారు. ఈ ఎయిర్ బెలూన్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రైడ్లు చేసేందుకు అవకాశం కల్పించారు. ఒక్కో వ్యక్తికి రూ.1500 రుసుం వసూలు చేస్తున్నారు. ఈ హాట్ ఎయిర్ బెలూన్ భూమి నుంచి 300 అడుగుల ఎత్తువరకు ఎగిరి అక్కడి నుంచి విహంగ వీక్షణం చేస్తున్నారు. ఇది అరకు పర్యటనకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఎంతో మధురానుభూతిగా మిగిలిపోతుందని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.