Maharashtra Assembly Polls Updates : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీలో సీట్ల పంపకాలపై చర్చలు ముగింపు దశకు వచ్చాయి. కాంగ్రెస్, శివసేన (UBT), NCP (శరద్ పవార్ వర్గం) తలో 85 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. మొత్తంగా 270 సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరగా, మిగతా 18 స్థానాలను సమాజ్‌వాదీ పార్టీ సహా ఇతర భాగస్వామ్యపక్షాలకు ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నట్లు కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే వెల్లడించారు. సీట్ల పంపకాలపై తుది ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నట్లు చెప్పారు. మహా వికాస్ అఘాడీ కూటమిగా బరిలోకి దిగి, మహాయుతి కూటమిపై విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇంకా చర్చలు కొనసాగుతున్నాయ్!
మరోవైపు 12 సీట్లు ఆశిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికే 5 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. దీనిపై సమాజ్‌వాదీ పార్టీతో పాటు కూటమిలోని ఇతర పార్టీలతో చర్చలు జరిపి గురువారం నాటికి అంతా పూర్తి చేస్తామని నానా పటోలే తెలిపారు. తామంతా మహా వికాస్ అఘాడీ కూటమిగా పోటీ చేస్తున్నామని, ఎన్నికల్లో ‘మహాయుతి కూటమి’పై విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సీట్ల సర్దుబాటులో జరుగుతున్న జాప్యం పట్ల చిన్న పార్టీలు గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. సమాజ్‌వాదీ పార్టీ, ఆప్, లెఫ్ట్, పీడబ్ల్యూపీలు- మహా వికాస్ అఘాడీ కూటమిలో ఉన్నాయి.
సీఎం శిందేపై పోటీ ఎవరంటే?
మరోవైపు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు శివసేన (యూబీటీ) అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మొత్తం 65మందితో జాబితాను విడుదల చేసింది. ముంబయిలోని వర్లి నుంచి మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే పోటీ చేయనున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే నియోజకవర్గమైన కోప్రి పాచ్‌పఖడి సీటులో ఆయన రాజకీయ గురువు ఆనంద్ దిఘే సోదరుడి కుమారుడైన కేదార్ దిఘేను ఉద్ధవ్ ఠాక్రే బరిలో దించారు. ప్రస్తుతం కేదార్ దిఘే ఠానే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఉద్ధవ్ అనుయాయుడు, మాజీ ఎంపీ రాజన్ విచారేకు ఠానే అసెంబ్లీ సీటును కేటాయించారు. అవిభాజ్య శివసేన తరఫున 2009 నుంచి ఏక్‌నాథ్ శిందే కోప్రి పాచ్‌పఖడీ సీటు నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిపై 89వేల పైచీలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. సీఎం శిందే అక్టోబర్ 28న నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
Shiv Sena (Uddhav Thackeray faction) releases a list of 65 candidates for Maharashtra Assembly Elections pic.twitter.com/g4yrP3Dj01
— ANI (@ANI) October 23, 2024
45మంది అభ్యర్థులతో శివసేన ఫస్ట్ లిస్ట్- సీఎం శిందే అక్కడి నుంచే పోటీ