CM Revanth on RRR Land Acquire : హైదరాబాద్ రీజినల్ రింగ్‌రోడ్ దక్షిణ భాగానికి వెంటనే భూసేకరణ ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ పురోగతిపై కలెక్టర్లు రోజువారీ సమీక్ష నిర్వహించాలన్న సీఎం, భూసేకరణ సహా ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. ఆర్ఆర్ఆర్ పురోగతిపై సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉత్తరభాగంలో భూసేకరణ, పనుల వివరాలను అధికారులు వివరించారు.
భూసేకరణ వేగం పెరగాలని ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పరిధిలోని కలెక్టర్లు రోజువారీగా ఏం చేశారు, ఏం పురోగతి సాధించారు, దక్షిణ భాగంలో భూసేకరణ ప్రక్రియ, ఇతర అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిరోజు సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరాలు అందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. భూసేకరణలో పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. సీఎస్ శాంతికుమారితో పాటు మౌలికవసతులు, ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ఓఎస్డీ షానవాజ్ ఖాసీం ఆయా జిల్లాల కలెక్టర్లు, రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలని చెప్పారు.
ఎప్పటికప్పుడు పనుల పురగోతిని ఆ గ్రూప్‌లో అప్‌డేట్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఒక సమీక్ష సమావేశానికి మరో సమీక్ష సమావేశం మధ్య పురోగతి తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం సంగారెడ్డి-ఆమన్‌గల్-షాద్‌నగర్-చౌటుప్పల్ మార్గానికి సంబంధించి వెంటనే భూ సేకరణ ప్రారంభించాలని పేర్కొన్నారు. ఉత్తర భాగంగా ఇప్పటికే భూ సేకరణ చాలావరకు పూర్తైనందున దక్షిణ భాగంలో ప్రారంభించాలని స్పష్టం చేశారు.
సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలి : ఆ రహదారి విషయంలో ఏవైనా సాంకేతిక, ఇతర సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని అదే సమయంలో పనులు ముందుకుసాగాలని సీఎం రేవంత్ సూచించారు. ఆర్ఆర్ఆర్ మొత్తం మ్యాప్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. దక్షిణ భాగం ప్రతిపాదిత అలైన్‌మెంట్‌లో సీఎం కొన్ని మార్పులు సూచించారు. ఆ మార్పులపై క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలే లక్ష్యంగా అలైన్‌మెంట్ ఉండాలని, ఆ విషయంలో పారదర్శకంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
ఫ్యూచర్‌సిటీ రేడియల్ రోడ్ల నిర్మాణంపైనా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేశారు. రహదారుల నిర్మాణానికిముందే ఎక్కడికక్కడ ప్రధాన రోడ్లకు అనుసంధానం కావాలన్న సీఎం, సిగ్నల్ ఇతర సమస్యలు లేకుండా సాఫీగా ప్రయాణం సాగేందుకు వీలుగా నిర్మాణాలుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ అనుసంధానానికి అనువుగా రేడియల్ రోడ్లు ఉండాలని, ఫ్యూచర్‌సిటీలో ఏర్పాటు కానున్న వివిధ రకాల పరిశ్రమలు, సంస్థలకి ఉపయోగకరంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు.
తెలంగాణ అభివృద్ధిలో ఆర్ఆర్ఆర్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? - rrr Importance today prathidhwani