Telangana Chief Electoral Officer Vikas Raj Press Meet : జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. మొదటగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుందని వివరించారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద 4 అంచెల భద్రత ఉంటుందని సీఈవో వికాస్‌రాజ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ ఏజెంట్ల వద్ద, సిబ్బంది వద్ద కూడా సెల్ఫోన్లు ఉండవని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూల కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఉంటుందని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు, బారికేడ్లు, పటిష్ఠ భద్రత ఉంటుందన్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 2.17 లక్షల పోస్టల్ బ్యాలెక్టు వచ్చాయని సీఈవో వికాస్‌రాజ్ వివరించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం 276 టేబుళ్లు ప్రత్యేకంగా ఉంటాయన్నారు. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కింపు ఉంటుందన్నారు. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యల్పంగా 13 రౌండ్ల లెక్కింపు ఉంటుందని సీఈవో వికాస్ రాజ్ పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10 వేల మంది సిబ్బంది పాల్గొంటారన్నారు. సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు సిబ్బందిని ర్యాండమ్‌గా కేటాయిస్తామని అన్నారు. లెక్కింపు రోజు ఉదయం 5 గంటలకు మరోసారి ర్యాండమ్‌గా సిబ్బందిని కేటాయిస్తామని సీఈవో వికాస్‌రాజ్ అన్నారు. 2400కు పైగా మైక్రో అబ్జర్వర్లు ఉంటారని సీఈవో వికాస్‌రాజ్ స్పష్టం చేశారు.
"12 కంపెనీల కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత నిర్వహిస్తున్నారు. వీళ్లు కౌంటింగ్ టైం వరకు ఉంటారు. గతంలో లాగా ఈసారి కూడా అవుటర్ మోస్ట్ సెక్యూరిటీ ఉంటుంది. కౌంటింగ్ జరిగే ప్రాంతం నుంచి 100 మీటర్ల ప్రాంతం వరకు ట్రాఫిక్‌ను నియంత్రణ చేస్తుంటారు. ఈ తతంగం అంతా స్టేట్ పోలీసులు చూసుకుంటారు. ఎవరైనా లోపలికి వెళ్లాలంటే ఐడీ కార్డులు చెక్ చేస్తారు. కౌంటింగ్ గేటు వద్ద స్టేట్ అండ్ పోలీసులు ఉంటారు. కౌంటింగ్ లోపల 12 కంపెనీల కేంద్ర బలగాలు ఉంటాయి. ఇలా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది." - వికాస్‌రాజ్, సీఈవో
హైదరాబాద్‌లో 1200 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో : హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 13 ప్రాంతాల్లో 16 హాల్స్‌లో కౌంటింగ్ చేస్తామని, మూడు చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేస్తామని తెలిపారు. నిజాం కాలేజీలో పార్లమెంటు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను కమిషనర్ రోనాల్డ్ రాస్ పరిశీలించారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ప్రతి కౌంటింగ్ హాల్స్ 14 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
జూబ్లీహిల్స్‌లో 20 టేబుల్స్ ఉంటాయని, యాకత్‌పురలో అత్యధికంగా 24 రౌండ్స్‌లో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అలాగే చార్మినార్ నియోజకవర్గంలో 15 రౌండ్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో 17 రౌండ్లు ఉంటాయని చెప్పారు. మొత్తం 1200 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. ప్రతి రౌండ్‌కు 30 నిమిషాల సమయం పడుతుందని అన్నారు.
తెలంగాణలో 14 సీట్లు పక్కా - లోక్‌సభ ఫలితాలపై కాంగ్రెస్ ధీమా! - TPCC ESTIMATION ON LOK SABHA RESULT