TDP Leaders Meet Chandrababu Naidu: తెలుగుదేశం ప్రకటించిన రెండు జాబితాల్లో (TDP Candidates List) చోటు దక్కని ఆశావహులు, అభ్యర్థులు చంద్రబాబు నివాసానికి క్యూ కట్టారు. నేతలను పిలిచి మాట్లాడుతున్న చంద్రబాబు వారి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చి బుజ్జగిస్తున్నారు. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు.
కొమ్మాలపాటి శ్రీధర్‌ను జీవీ ఆంజనేయులు చంద్రబాబు వద్దకు తీసుకొచ్చారు. పెదకూరపాడు అభ్యర్థిగా గురువారం భాష్యం ప్రవీణ్‌ను చంద్రబాబు ప్రకటించారు. దీంతో శ్రీధర్ రాజకీయ భవిష్యత్తుకు చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే తగు ప్రాధాన్యం కల్పిస్తానని స్పష్టం చేశారు. పెదకూరపాడులో తెలుగుదేశం గెలుపు కోసం కలిసి పని చేయాలని చంద్రబాబు సూచించారు.
సందిగ్ధతలో తెలుగుదేశం సీనియర్ నేతలు- కోరుకున్న సీట్లు రావడం కష్టమే!
అదే విధంగా కళా వెంకట్రావు సైతం చంద్రబాబు నివాసానికి వచ్చారు. ప్రస్తుతం ఎచ్చెర్ల ఇన్‌ఛార్జ్‌గా కళా వెంకట్రావు ఉన్నారు. రెండో విడత జాబితాలోనూ కళా పేరు లేకపోవడంతో ఆయన వర్గీయులలో ఆందోళన నెలకొంది. టీడీపీ నేత బోడె ప్రసాద్ చంద్రబాబు నివాసానికి వచ్చారు. బోడె ప్రసాద్ పెనమలూరు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
తెలుగుదేశం ప్రకటించిన 2 జాబితాల్లో బోడె ప్రసాద్‌కు చోటు దక్కలేదు. బోడె ప్రసాద్‌ను చంద్రబాబు బుజ్జగించారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు చంద్రబాబు నివాసానికి వచ్చారు. కాకినాడ అర్బన్ టికెట్ రెండు జాబితాల్లోనూ ప్రకటించలేదు. కాకినాడ అర్బన్ స్థానం పొత్తుతో ముడిపడి ఉందని ప్రచారం జరుగుతోంది.
అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి పెద్దపీట - ఆశీర్వదించి గెలిపించాలి: చంద్రబాబు
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ టికెట్ పరిటాల శ్రీరామ్‌కి కేటాయించాలంటూ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఇంటి వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పరిటాల శ్రీరామ్‌కు ధర్మవరం టీడీపీ టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో పార్టీ కష్ట కాలంలో పరిటాల శ్రీరామ్ కార్యకర్తలకు ధైర్యం చెప్పి పని చేశారని గుర్తు చేశారు.
తమపై అనేక కేసులు నమోదైనా కూడా అధికార పార్టీ బెదిరింపులకు ఎదురెళ్లి పని చేశామన్నారు. అయితే ఇప్పుడు పొత్తులో భాగంగా టికెట్ లేదు అనే సమాచారం రావడం తమకు బాధ కలిగిస్తోందన్నారు. పరిటాల శ్రీరామ్‌కు టికెట్ ఇస్తే 20 వేల మెజారిటీతో గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పార్టీ అధిష్టానం ఈ మేరకు ఆలోచన చేయాలని కోరారు. టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా నిర్ణయాలు ఉండకూడదని విన్నవించారు. పరిటాల శ్రీరామ్‌కి ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
మూడు పార్టీల పొత్తు జగన్‌ను ఓడించడం కోసమే కాదు - రాష్ట్రాన్ని గెలిపించడం కోసం : చంద్రబాబు