Navodaya Vidyalaya in Palnadu District: గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా అత్యుత్తమ విద్యను అందిస్తోంది పల్నాడు జిల్లాలోని నవోదయ విద్యాలయం. దాదాపు 40 ఏళ్ల కిందట ఏర్పాటైన ఈ విద్యా సంస్థ మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త కోర్సులను, సాంకేతిక అంశాల్ని విద్యార్థులకు చేరువ చేస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అవసరమైన జేఈఈ, ఐఐటీ, నీట్, బిట్స్ పిలానీ లాంటి పరీక్షలకు ఉచితంగా శిక్షణనిస్తూ విజేతలుగా నిలుపుతోంది. ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తూ వారి లక్ష్యసాధనకు దోహదపడుతుంది. విజ్ఞాన జ్యోతి లాంటి కార్యక్రమాలతో బాలికల విద్యన్నోతికి బాసటగా నిలుస్తోంది.
కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా: ఒక విద్యార్థి ఇంజినీర్ కావాలన్నా, ఓ విద్యార్థిని వైద్యురాలు కావాలన్నా లేక నచ్చిన ఐటీ రంగం వైపు అడుగులు వేయాలన్నా ఇంటర్ విద్యే కీలకం. పదో తరగతి, ఆ తరువాత రెండేళ్ల ఇంటర్ కోర్సులో అందించే బోధన, నేర్పించే మెలకువలే వారిని లక్ష్య సాధన వైపు నడిపిస్తాయి. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష, జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ లాంటి అనేక పోటీల్లో జాతీయ స్థాయిలో రాణించేలా చేస్తాయి. అందుకే ఎక్కువ మంది యువత కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షలు ఖర్చు పెట్టి శిక్షణ తీసుకుంటూ ఉంటారు. వారికి భిన్నంగా ఎలాంటి ఆర్ధిక భారం లేకుండా అత్యుత్తమ విద్యను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందిస్తోంది పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని మద్దిరాల నవోదయ విద్యాలయం. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా స్మార్ట్ తరగతులు నిర్వహిస్తూ 450 మంది విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందిస్తోంది. అత్యుత్తమ కంప్యూటర్ ల్యాబ్, అధునాతన ప్రయోగశాలలతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తోంది.
విద్యార్థినులకు రూ.12 వేల ఉపకారవేతనం: జేఈఈ అడ్వాన్స్, జేఈఈ మెయిన్స్, నీట్ లాంటి ప్రవేశ పరీక్షలకు విద్యార్థుల్ని సన్నద్ధం చేయడమే కాకుండా బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది విజ్ఞాన జ్యోతి అనే కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు 12 వేల ఉపకారవేతనం అందిస్తోంది. పోటీ పరీక్షలకు అవసరమైన 8 వేల రూపాయల పుస్తకాలను ఉచితంగా అందిస్తూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల కంటే మిన్నగా ప్రత్యేక శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తోంది. విశేషానుభవం ఉన్న సబ్జెక్టు నిపుణులతో ఆన్ లైన్ తరగతులు అందిస్తోంది. సైన్సు క్యాంపులను, కార్యశాలలను, విజ్ఞాన యాత్రలను విద్యార్థుల కోసం నిర్వహిస్తోంది. పోటీ పరీక్షల్లో ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పిస్తోంది. ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న 195 మంది గ్రామీణ విద్యార్థినుల్ని దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో సీటు సంపాదించే ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతోంది.
గత రెండు మూడు ఏళ్లుగా మద్దిరాల నవోదయ విద్యాలయ విద్యార్థులు జేఈఈ, నీట్ పరీక్షల్లో చక్కటి ప్రతిభ చూపుతూ మంచి ర్యాంకులు సొంతం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం శాస్త్ర సాంకేతిక రంగాల వైపు గ్రామీణ విద్యార్థినుల్ని నడిపించడమే ధ్యేయంగా విజ్ఞాన జ్యోతిని అమలుచేస్తోంది. ఈ పథకాన్ని స్వదినియోగం చేసుకుంటూ అటు ఇంటర్ లోనూ, ఇటు పోటీ పరీక్షల్లోనూ అత్యుత్తమ మార్కులు సాధిస్తున్నారు విద్యార్థినులు.
''గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తాము కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఉత్తమ విద్యను, పోటీ పరీక్షల శిక్షణ ఉచితంగా అందిస్తున్నాం. మరోవైపు ఆవంతి, దక్షిణ సంస్థలు నిర్వహించే ప్రత్యేక విద్య కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నాం. నవోదయ విద్యాలయం విద్యార్థుల జీవితాల్లో విద్యా వెలుగులు నింపుతూ దేశం మెచ్చే ఇంజినీర్లు, వైద్యులను సమాజానికి అందిస్తోంది''-నరసింహారావు, ప్రిన్సిపాల్
అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలా? యూజీసీ-నెట్ 2024కు అప్లై చేసుకోండిలా! - UGC NET 2024