Kanakamedala Ravindra Kumar Fire On CM Jagan : సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. జగన్ అనాలోచిత నిర్ణయాలు, వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర రైతాంగం కోలుకోలేని విధంగా దెబ్బతిందని ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ మోసపూరిత ప్రకటనలతో గతంలో ప్రజలను నమ్మించారని ఆయన విమర్శించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రైతు వ్యతిరేక విధానాలు : వ్యవసాయ రంగం, రైతుల్ని ఆదుకోవడంలో జగన్ కేవలం మాటల మనిషిగానే మిగిలిపోయాడని కనకమేడల రవీంద్ర కుమార్ దుయ్యబట్టారు. అన్నదాతల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో 3వ స్థానంలో నిలిపిన జగన్ రెడ్డి, కౌలు రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో, రైతుల అప్పుల్లో కూడా ఏపీని అగ్రస్థానంలో నిలిపాడని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో సుమారు 93.2శాతం రైతు కుటుంబాలు అప్పులపాలు అయ్యాయని వాపోయారు.
పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తారు ? పార్లమెంటులో ప్రశ్నించిన ఎంపీ కనకమేడల
రైతాంగానికి 80వేల కోట్ల రూపాయలు నష్టం : తెలుగుదేశం ప్రభుత్వంలో 73 శాతం పూర్తైన పోలవరం ప్రాజెక్ట్, ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను జగన్ సర్కార్ పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తులు, కరువు వల్ల రాష్ట్ర రైతాంగం 80వేల కోట్ల రూపాయలు నష్టపోయిందని ఆరోపించారు. ధాన్యం సేకరణలో జగన్ సర్కార్ వ్యవహరించిన తీరుతో వరి రైతులు 5 ఏళ్లలో 21వేల కోట్లు నష్టపోయారని అన్నారు.
రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానం - రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది : ఎంపీ కనకమేడల
కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో జగన్ విఫలం : కరువు మండలాల ప్రకటన, కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సాయం పొందడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కనకమేడల ఆగ్రహం వ్యక్తం చేశారు. కరవు మండలాలకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో జగన్ విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు పూర్తిగా కుదేలయ్యారని వారిని ఆదుకోవాలన్న శ్రద్ధ జగన్ రెడ్డి ప్రభుత్వానికి లేదని నిప్పులు చెరిగారు.
Kanakamedala Complaint on YSRCP Govt: ఏపీలో మానవ హక్కుల అణచివేత.. జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఫిర్యాదు