Bonalu Festival Celebrations in Singapore : తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండగ వేడుకలు ఆదివారం మధ్యాహ్నం అత్యంత వైభవంగా జరిగాయి. భాగ్యనగరంలో ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగిన రోజున సింగపూర్‌లో కూడా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని టీసీఎస్‌ఎస్ సభ్యులు తెలిపారు. ఈ బోనాల వేడుకలను స్థానిక సుంగే కేడుట్‌లోని శ్రీ అరసకేసరి శివాలయంలో ఘనంగా జరుపుకున్నారు. బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో సింగపూర్‌లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా ఇతరులతో కలిపి సుమారు 1000 మంది వరకు భక్తులు పాల్గొన్నారు.
బోనాల ఊరేగింపులో చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆడిపాడారు. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరికీ మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని టీసీఎస్‌ఎస్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.
బోనం సమర్పించిన భక్తులకు రిటర్న్ గిఫ్ట్ : బోనాల జాతరలో పోతురాజు, పులివేషాలతో జాతరకు కళ తెచ్చిన నేరెళ్ల శ్రీనాథ్, గౌడ లక్ష్మణ్, అయిట్ల లక్ష్మణ్, అరవింద్‌లకు టీసీఎస్‌ఎస్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. బోనం సమర్పించిన భక్తులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులు రిటర్న్ గిఫ్ట్‌ను అందజేశారు. వీరితో పాటు గడప రమేశ్ అమ్మవారి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకుకొచ్చారు.
ఎల్లప్పుడూ తెలంగాణ కల్చరల్ సొసైటీ వెన్నంటే ఉండి సహకారం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అందరిపై ఉజ్జయిని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని సొసైటీ సభ్యులు ఆకాంక్షించారు.
బోనాల పండుగ ప్రాముఖ్యత, విశిష్టత తెలిసేలా : తెలంగాణ బోనాల పండుగ ప్రాముఖ్యత, విశిష్టతను సింగపూర్ వాసులకు తెలియపరిచే ప్రేరణతో ఫేస్ బుక్ వేదికగా నిర్వహించిన పోటీలలో భాగంగా ఉత్తమ రచన విజేతలుగా నిలిచిన మొదటి ఐదుగురికి గిఫ్ట్ వోచర్స్ అందజేశారు.