Tax Evasion in Liquor Sales Issue in Telangana : తెలంగాణలో మద్యం అమ్మకాల అంశంలో పన్ను ఎగవేతంటూ (Tax Evasion in Liquor Sales) రాద్ధాంతం నడుస్తుంది. ఈ అంశం ప్రభుత్వంలో కీలకమైన రెండు శాఖలను అతలాకుతలం చేస్తోంది. రాష్ట్రంలోని డిస్టిలరీలల్లో, బీవరీలల్లో తయారయ్యే లిక్కర్, బీరులతోపాటు బయట రాష్ట్రాల నుంచి కాని, బయట దేశాల నుంచి దిగుమతయ్యే మద్యంపై సర్కార్ 70 శాతం వ్యాట్ విధించాల్సి ఉంటుంది. ఈ వ్యాట్ కారణంగా ప్రతి నెలా రూ.1000 కోట్ల నుంచి రూ.1200 కోట్ల మేరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.
మద్యం దుకాణాలకు, బార్లకు, క్లబ్‌లకు సరఫరా అయ్యే ప్రతి బాటిల్ సైతం మద్యం డిపోలకు వెళ్లి లేబులింగ్ కావడం తప్పనిసరి. గతంలో అటు వాణిజ్య పన్నుల శాఖకు, ఇటు ఎక్సైజ్ శాఖకు పర్యవేక్షణ అధికారులు ఒక్కరే ఉండడం, రెండూ ప్రభుత్వ శాఖలు కావడంతో వ్యాట్ చెల్లింపుల విషయంలో ఎలాంటి వివాదం తలెత్తేది కాదు. తాజాగా ఈ రెండు శాఖలు వేర్వేరు అధికారుల పర్యవేక్షణలో ఉండడంతో పరిస్థితులు పూర్తిగా గతంకంటే భిన్నంగా మారిపోయినట్లుగా తెలుస్తోంది.
Telangana Liquor Sales Tax Issue : వాణిజ్య పన్నుల శాఖలో పన్నుల రాబడులు తగ్గినప్పుడు, మద్యం అమ్మకాలపై ప్రతి నెల చెల్లించే మొత్తం కంటే రెండు, మూడు వందల కోట్లు అదనంగా చెల్లించేట్లు గతంలో అధికారులు చర్యలు తీసుకునేవారు. వాణిజ్య పన్నుల శాఖ (Commercial Taxes Department) కమిషనర్‌గా టీకే శ్రీదేవి బాధ్యతలు తీసుకున్న తర్వాత పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. వరుస సమీక్షలు చేసినప్పుడు మద్యంపై వస్తున్ననెలవారీ వ్యాట్‌లో పెద్దగా తేడా ఉండడం లేదని ఆమె గుర్తించారు.
ఒక్క టానిక్ వైన్స్‌లోనే రూ.1000 కోట్ల 'పన్ను ఎగవేత' లావాదేవీలు!
మద్యం అమ్మకాలు పెరిగినప్పుడు వ్యాట్ రాబడి కూడా పెరగాలి కదా అని అధికారులను కమిషనర్ శ్రీదేవి నిలదీయంగా ముందు నుంచి బేవరేజ్‌స్ కార్పోరేషన్ లిమిటెడ్ చెల్లించే మొత్తంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్న సమాధానంతో కమిషనర్ అలా ఏలా అవుతుందని ప్రశ్నించారు. ప్రతిది లెక్కాపత్రం ఉండాలి కదా బీసీఎల్ ఎంత చెల్లిస్తే అంతే వ్యాట్ అని ఏవిధంగా అనుకుంటామని అధికారులను ఆమె నిలదీసినట్లుగా సమాచారం.
వ్యాట్ చెల్లింపుల్లో తేడా వస్తున్నట్లు గుర్తింపు : రాష్ట్రంలో నెలవారీగా తయారవుతున్న మద్యం, బయట నుంచి దిగుమతి అవుతున్న మద్యం వివరాలు, ఇక్కడ అమ్ముడు పోతున్న మద్యం వివరాలపై లోతైన అధ్యయనం చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ శ్రీకారం చుట్టింది. దీంతో వ్యాట్ చెల్లింపుల్లో తేడా వస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. ఇందులో భాగంగా ఇటీవల మద్యం ఉత్పత్తులపై రెండు బేవరేజీల్లో తనిఖీలు చేసింది. ఒక్క బేవరేజిపై ఎఫిషియెన్సీ ఆడిట్ నిర్వహించడం ద్వారా ఏడాదిలో దాదాపు రూ.90 కోట్ల మేర వ్యాట్ ఎగవేతకు గురైనట్లు నిర్ధారణకు వచ్చింది.
Commercial Taxes Department VS Excise Department : అయితే దీనిని మరింత లోతైన ఆడిట్ చేయాలని నిర్ణయించిన వాణిజ్య పన్నుల శాఖ తాజాగా ఎక్సైజ్ అకాడమీలో హోలోగ్రామ్‌ల ప్రింటింగ్ పరిశ్రమపై, మాదాపూర్‌లోని ట్రాకింగ్ సిస్టమ్ సేవలు అందిస్తున్న సంస్థలో సోదాలు నిర్వహించింది. మరోవైపు డిపోల నుంచి దుకాణాలకు, బార్లకు, క్లబ్‌లకు మద్యం సరఫరా చేస్తున్న వాహనాలను అధికారులు తనిఖీ చేశారు. వాహనాల వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల వాహనాల్లో సరఫరా అవుతున్న సరుకు విలువపై ట్యాక్స్, పెనాల్టీలు విధించారు. దీంతో దుకాణదారులుకాని, బార్లు యజమానులుకాని డిపోల నుంచి మద్యాన్ని తీసుకోవడాన్ని రెండు రోజులుగా నిలుపుదల చేశారు.
ఆ సంస్థల్లో ఆడిటింగ్ మర్చిపోయిన వాణిజ్య పన్నుల శాఖ
బేవరేజ్‌స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి తాము మద్యం కొనుగోలు చేస్తున్నందున అందుకు సంబంధించి ఇన్‌వాయిస్, ఈ వే బిల్లులు, వాహన పర్మిట్‌లు ఇవ్వాల్సిన బాధ్యత డిపో అధికారులదేనని దుకాణదారులు చెబుతున్నారు. మరోవైపు ప్రతి బాటిల్ జాడ తెలుసుకోడానికి ట్రాకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉందని, అక్కడ 70 శాతం వ్యాట్ విధించి లేబులింగ్ అయ్యాకనే మద్యం బాటిల్ బయటకు వస్తుందని ఎక్సైజ్ శాఖ (Excise Department)అధికారులు వాదిస్తున్నారు.
సీఎస్ వద్దకు చేరిన పంచాయతీ : ఇలాంటప్పుడు వ్యాట్ ఎగవేతకు ఏ మాత్రం అవకాశం ఉండదని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. అందుకు 2018లో తెలంగాణ సర్కార్ ఇచ్చిన జీవో నంబరు 30 ను ఉదహరిస్తున్నారు. దీంతో రెండు ప్రభుత్వ శాఖల మధ్య వ్యాట్ చెల్లింపుల వ్యవహారంలో తలెత్తిన పంచాయతీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వద్దకు చేరినట్లు తెలుస్తోంది. రెండు శాఖలకు చెందిన కమిషనర్లతోపాటు ఉన్నతాధికారులు సీఎస్ సమీక్షలో పాల్గొన్నట్లు సమాచారం.
రెండు శాఖలూ తెలంగాణ సర్కార్‌కు పెద్ద మొత్తంలో రాబడులు తెచ్చి పెట్టేవి కావడంతో ఈ వివాదానికి తెరదించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. మద్యం దుకాణదారులు మాత్రం వీలైనంత త్వరగా ఈ వివాదానికి తెరపడితే వాణిజ్య పన్నుల శాఖ స్వాధీనంలో ఉన్నవాహనాలు విడుదల కావడంతో పాటు ఆగిన మద్యం సరఫరా తిరిగి కొనసాగుతుందని వైన్‌షాపుల అసోసియేషన్ తెలిపింది.
విదేశీ మద్యం పేరుతో భారీగా 'పన్ను ఎగవేత' - సమగ్ర విచారణకు ప్రభుత్వ ఆదేశం
ఆదాయం పెంచుకునే మార్గాలపై సర్కార్ ఫోకస్ - ఎలైట్ బార్లు, దుకాణాల ఏర్పాటుకు కసరత్తులు!