Symptoms Of Dengue Fever : ఏటా వర్షాకాలంలో పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు ఎంతోమంది వైరల్ ఫీవర్ల బారిన పడుతుంటారు. అందుకు దోమల బెడద ఎక్కువగా ఉండడం, నీరు కలుషితమవడం వంటివి ముఖ్యకారణాలు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ పరిధిలో కూడా భారీగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. డెంగీ కారణంగా చాలా మందిలో ప్లేట్‌లెట్లు పడిపోతున్నాయి. దీంతో ఎంతో మంది అత్యవసర చికిత్సల కోసం ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అయితే, చాలా మందిలో ప్లేట్‌లెట్లు తగ్గడం.. మరికొందరిలో డెంగీ కారణంగా కాలేయ, కిడ్నీలపై ప్రభావం ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఈ సీజన్లో డెంగీతో పాటు గన్యా బాధితులు పెరుగుతున్నారని వారు చెబుతున్నారు. దోమకాటుతో వచ్చే గన్యాలో ఫీవర్, తీవ్రమైన కీళ్లు నొప్పులు ఉంటాయని పేర్కొంటున్నారు. అయితే, డెంగీ జ్వరం వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కిమ్స్ హాస్పిటల్కు చెందిన సీనియర్ ఫిజీషియన్ "డాక్టర్ శివరాజ్" ఇప్పుడు చూద్దాం.
డెంగీని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ జ్వరంతో బాధపడేవారు అప్రమత్తంగా ఉంటూ ప్లేట్‌లెట్లు, బీపీ తగ్గకుండా చూసుకోవడం వల్ల నయమవుతుందని చెబుతున్నారు. ఒకవేళ ఫీవర్ తగ్గినా జాగ్రత్తగా ఉండి ప్లేట్‌లెట్లు చూసుకోవాలంటున్నారు.
- కొంతమంది అవసరం లేకపోయినా కూడా ప్లేట్‌లెట్లు ఎక్కించుకుంటారు. కానీ, ఇలా చేయకూడదు. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
- ఒకవేళ ప్లేట్‌లెట్లు తగ్గితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ, రక్తస్రావం, లివర్, కిడ్నీపై ప్రభావం, బీపీ తగ్గడం, వాంతులు, కడుపులో నొప్పి, తీవ్ర నిస్సత్తువ వంటి ఇతర సమస్యలు ఏర్పడితే వెంటనే అప్రమత్తం కావాలి. లేకపోతే బ్రెయిన్‌హేమరేజ్‌కు దారి తీస్తుంది.
- డెంగీ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే NS 1 యాంటిజెన్ పరీక్ష చేసి నిర్ధారణ అయితే ట్రీట్మెంట్ ప్రారంభించాలి. ఫీవర్ వచ్చి 5 రోజులు దాటితే డెంగీ నిర్ధారణకు ఐజీఎం యాంటీబాడీల టెస్ట్ చేయాలి.
- వైరల్ వల్ల కూడా తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి డెంగీ తరహా లక్షణాలు కనిపిస్తాయి.
- వీరు సాధారణ చికిత్స తీసుకుంటూనే.. కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి ద్రవాలు ఎక్కువగా తాగాలి.
- మూడు రోజుల తర్వాత కూడా తగ్గకుండా.. అవే లక్షణాలు కొనసాగితే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.
- టైగర్‌దోమ కుట్టిన 4 నుంచి 5 రోజులకు డెంగీ లక్షణాలు మనలో కనిపిస్తాయి. 102 డిగ్రీల జ్వరం, కళ్ల వెనుక భాగంలో పెయిన్, ఒంటి నొప్పులు, ఒంటిపై ఎర్రటి దద్దర్లు ఉంటే డెంగీగా అనుమానించాలని డాక్టర్ శివరాజ్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
వర్షాలతో విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు - అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
Viral Infection VS Dengue : డెంగ్యూ Vs వైరల్ ఇన్ఫెక్షన్.. లక్షణాలు ఒకేలా ఉంటాయా.. తేడా ఏంటీ..?