Mother and Children Death Mystery in Khammam : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండా వద్ద అనుమానాస్పద స్థితిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ, ఇద్దరు పిల్లల మృతి ఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది. ముగ్గురు మృతుల శరీరాలపై ఒక్క రక్తపు గాయం లేకుండా విగత జీవులుగా పడి ఉండటం, భర్త బోడ ప్రవీణ్‌కు కూడా రక్తపు గాయం కాకపోవడంతో ఘటనకు కారణం రోడ్డు ప్రమాదమా, లేక హత్యా కోణమా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
మూడు పదుల వయసు చేరని బిడ్డతోపాటు అభం శుభం తెలియని ఇద్దరు పసిమొగ్గలు కానరాని లోకాలకు వెళ్లిపోయారంటూ మృతురాలి కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. చిన్నారుల మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. శవ పరీక్షల కోసం తల్లి కుమారి, ఇద్దరు కూతుళ్లు కృషిక, తనిష్క మృతదేహాలను ఖమ్మం సర్వజన ఆసుపత్రి శవగారానికి తరలించగా, మృతురాలి కుటుంబసభ్యులు, బంధువుల ఆందోళనలతో రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అసలెేం జరిగిందంటే : ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రంగాపురానికి కుమారికి, బావోజీ తండాకు చెందిన ప్రవీణ్‌కు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కృషిక(4), తనిష్క(3) ఉన్నారు. ప్రవీణ్ కుమార్ ఫిజియోథెరపీ వైద్యుడిగా హైదరాబాద్‌లో పనిచేస్తుండగా కుటుంబమంతా అక్కడే ఉంటోంది. 20 రోజుల క్రితం పిల్లలతో కలిసి సొంతూరైన బావోజీ తండాకు వచ్చిన దంపతులు, మంగళవారం రోజున కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు.
ఈ క్రమంలోనే రఘునాథపాలెంలో ఓ చెట్టుకు కారు ఢీకొని రోడ్డు ప్రమాదం కాగా అందులో ఉన్న తల్లి కుమారి, పిల్లలు ఇద్దరూ చనిపోయారు. వాహనం నడుపుతున్న ప్రవీణ్‌కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా గాయపడిన ప్రవీణ్‌తో పాటు తల్లీపిల్లలను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముగ్గురి మృతదేహాలపై గాయాలు కనిపించకపోవడంతో కుమారి కుటుంబసభ్యులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రవీణే చంపి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించాడని మృతురాలి బంధువుల ఆరోపణ : రోడ్డు ప్రమాదమైతే, కారు నడుపుతున్న బోడ ప్రవీణ్‌కు ఎలాంటి గాయాలు ఎందుకు కాలేదని ప్రశ్నించారు. ముగ్గురినీ హత్య చేసిన తర్వాతే కారులో తీసుకెళ్లి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపించారు. ప్రమాద సమయంలో కారు నడిపిన మృతురాలి భర్త బోడ ప్రవీణ్‌కు ఎలాంటి గాయాలు ఎందుకు కాలేదని ప్రశ్నించారు. కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన ఇద్దరు కూతుళ్లు మృతిచెందినా భర్త అతని కుటుంబ సభ్యులు కనీసం ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడటం లేదని మండిపడ్డారు.
Family Murder Mystery : తమకున్న అనుమానాలు నివృత్తి చేసేవరకు శవ పరీక్షలు చేసేదే లేదంటూ మృతురాలి కుటుంబ సభ్యులు పట్టుబడ్డారు. ఓవైపు ముగ్గురి మృతదేహాలు చూసి కన్నీరు మున్నీరవడం, ఇంకోవైపు కడుపు మండి పలుమార్లు ఆందోళనకు దిగడంతో ఖమ్మం సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలో రోజంతా ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. మృతురాలి భర్త ప్రవీణ్‌ను తీసుకురావాలంటూ డిమాండ్ చేశారు.
కుటుంబ సభ్యుల అనుమానాలన్నింటిపైనా సమగ్ర విచారణ జరుపుతామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇలా రోజంతా ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసులు వారందరికీ నచ్చజెప్పడంతో శవపరీక్షలకు అంగీకరించారు. సాయంత్రానికి శవ పరీక్షలు పూర్తి చేసి మృతదేహాలను భర్త స్వగ్రామం బాబోజీ తండాకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
మృతురాలి తండ్రి ఆవేదన : తన కుమార్తెకు ఇద్దరు ఆడపిల్లలేనని, కుమారుడు పుట్టలేదని తన అల్లుడు ప్రవీణ్ అసంతృప్తితో ఉన్నాడని కుమారి తండ్రి హరిసింగ్ తెలిపారు. ఈ క్రమంలో కేరళకు చెందిన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. దీనిపై ఏడాదిగా దంపతుల మధ్య వివాదం నడుస్తోందని, ఈ క్రమంలో వారు చనిపోవడం, కుమారి, పిల్లల శరీరంపై ఒక్క గాయం కూడా లేకపోవడంపై అనుమానంగా ఉందని అన్నారు.
ప్రమాదం జరిగిన వారిని అంబులెన్సులో తీసుకువస్తుంటే అతన్ని మాత్రం ఎందుకు వేరే వాహనంలో తరలించారని ప్రశ్నించారు. దీనిపై విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు. ముగ్గురి మృతి కేసు పురోగతి ఇప్పుడు శవపరీక్ష నివేదిక కీలకం కానుంది. మృతురాలి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో నివేదికలో మృతికి గల కారణాలు నివృత్తి అయ్యే అవకాశం కనిపిస్తోంది.
కామారెడ్డిలో వరుస మృతదేహాల కలకలం - భయాందోళనలో స్థానికులు - Series Murders Noticed in Kamareddy