Sunitha Reddy React on YS Avinash Reddy Comments: అప్రువర్‌గా మారినంత మాత్రాన దస్తగిరి శిక్ష నుంచి తప్పించుకుంటారని ఏమీ లేదని వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి అన్నారు. తాము సీబీఐని ప్రభావితం చేస్తున్నాం అంటే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. కడపలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె అవినాష్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
గతంలో సజ్జల, ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు మాట్లాడుతున్నానని ఆరోపిస్తున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. దారుణ హత్య విషయంలోనూ రాజకీయాలే చూస్తారా అని వాపోయారు. ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాజకీయాలే కాకుండా జీవితం కూడా ఉంటుందని గుర్తించాలని పేర్కొన్నారు. చంద్రబాబు తన కేసుల్లోనే కొన్ని ఇబ్బందుల్లో ఉన్నారని, నా కేసులో సీబీఐని చంద్రబాబు ఎలా ప్రభావితం చేస్తారని ప్రశ్నించారు. ఐదేళ్లుగా కేసు ముందుకెళ్లడం లేదంటే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని తెలిపారు. వివేకా చివరి కోరిక షర్మిలను ఎంపీ చేయడమే అని దాన్ని నెరవేర్చే బాధ్యత తనపై ఉందని సునీత పేర్కొన్నారు.
అవినాష్ తప్పుకోవాలి: వివేకా అవినాష్ కోసం వివేకా ప్రచారం చేశారన్నారు, మీ కోసం అంతగా కష్టపడిన వ్యక్తి కోసం మీరేం చేశారని అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. అవినాష్ ఎంపీగా, జగన్ సీఎంగా ఉన్నారు, మాకు న్యాయం చేశారా అంటూ ప్రశ్నించారు. వివేకా చేసిన మంచిపనుల గురించి ఈ ఐదేళ్లలో ఒక్కమాట చెప్పారా అంటూ నిలదీశారు. మీ కోసం కష్టపడిన వ్యక్తి గురించి ఒక్కసారైనా మీ పత్రికలో రాశారా అని ప్రశ్నించారు. మీకోసం కష్టపడిన షర్మిలకు 2014లో ఎందుకు సీటు ఇవ్వలేదని సునీత ఎద్దేవా చేశారు. అవినాష్ పోటీ నుంచి తప్పుకోవాలని సునీత డిమాండ్ చేశారు. హంతకులకు ఓటు వేయకండి, మీ కోసం పోరాటం చేసేవారికి ఓటేయాలని సునీత రెడ్డి పిలుపునిచ్చారు.
గూగుల్ టేకౌట్ ప్రకారం అవినాష్ ఇంట్లో ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నారని, వివేకా హత్య ఘటనపై జగన్‌కు ఏమని సమాచారం ఇచ్చారని ప్రశ్నించారు. గూగుల్ టేకౌట్ ఫ్యాబ్రికేటెడ్ అని అవినాష్ అంటున్నారని, టేకౌట్ రిపోర్ట్‌ను సీబీఐ, సర్వే ఆఫ్ ఇండియా, ఎఫ్‌ఎస్‌ఎల్ తయారు చేశాయని గుర్తు చేశారు. అవినాష్‌పై సర్వే ఆఫ్ ఇండియా, ఎఫ్‌ఎస్‌ఎల్‌కూ కోపం ఉంటుందా అని ప్రశ్నించారు. అవినాష్ ఫోన్ దర్యాప్తు అధికారికి ఇస్తే కడిగిన ముత్యంలా వస్తారని సునీత ఎద్దేవా చేశారు.
జగన్‌కు గుండెపోటు అని చెప్పారా, హత్య అని చెప్పారా అంటూ నిలదీశారు. సిట్‌లో స్టేట్‌మెంట్ ఇచ్చానని అవినాష్‌రెడ్డి చెప్పారు, అర్థం పర్థం లేని స్టేట్‌మెంట్లు రాసుకున్నారని విమర్శించారు. అందుకే కేసును స్థానిక పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేసినట్లు గుర్తు చేశారు. ఈ కేసును ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు మార్చిందని, సాక్షులు చనిపోతున్నారనే కారణంతో విచారణను తెలంగాణకు మార్చారని సునీత పేర్కొన్నారు. ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు, పులివెందుల ప్రజలకు ఇదంతా తెలుసని ఎద్దేవా చేశారు.
ఆధారాల్లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు: ఎంపీ అవినాష్‌రెడ్డి - Avinash React on Sunitha Comments