Heat Waves in Telangana : రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు నమోదయ్యాయి. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీలు దాటింది. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా మంథని, సూర్యాపేట జిల్లా మునగాల, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పమ్మిలలో 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. 2013 నుంచి అందుబాటులో ఉన్న వాతావరణ రికార్డుల ప్రకారం మే 3న నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం. నిర్మల్, మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో 45.2 నుంచి 45.8 డిగ్రీల మధ్య ఎండ నమోదయ్యాయి.
తీవ్రమైన ఎండల ధాటికి 18 జిల్లాల్లోని 95 మండలాల్లో వడగాలులు వీచాయి. ఇందులో నల్గొండ జిల్లాలో 17, సూర్యాపేటలో 14 మండలాల్లో అత్యధికంగా వచ్చాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ నెల 6, 7 తేదీల్లో పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, పలు జిల్లాలకు వడగాలుల ముప్పు ఉందని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
Heat Strokes Death in Telangana : నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రానికి చెందిన గోలి శ్రీధర్(44) శుక్రవారం బయటకు వెళ్లి రోడ్డుపై ఉన్నట్టుండి పడిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇప్పల్‌తండాకు చెందిన రైతు అజ్మీర మంగ్యనాయక్(44) గురువారం వడదెబ్బకు గురికావడంతో నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మరణించారు.
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారానికి చెందిన రైతు వేల్పుల శ్రీనివాస్(55) పొలం పనులకు వెళ్లి ఎండదెబ్బకు గురై మరణించారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనంతారానికి చెందిన రైతు యెల్లంల నర్సిరెడ్డి(63) బయటకు వెళ్లి తిరిగొస్తూ ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురైయ్యారు. అనంతరం కుప్పకూలారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంటకు చెందిన గాండ్ల లింగయ్య(70) వడదెబ్బకు గురై మృతిచెందారు. నల్గొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన గుండ్లపెల్లి పెద్దవెంకన్న(58) ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగా చేస్తూ ఎండ తీవ్రతకు గురై చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి : ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం అత్యధికంగా నంద్యాల జిల్లాలోని గోస్పాడు, బండి ఆత్మకూరులో 47.7 డిగ్రీల ఎండ కాసింది. వడదెబ్బతో వివిధ జిల్లాల్లో ముగ్గురు వృద్ధులు మరణించారు. అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, విజయనగరం, వైఎస్సార్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు నమోదయ్యాయి.
నిప్పులు కురిపిస్తున్న భానుడు - ఆల్‌టైం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు - high temperatures in telangana