Nehru Zoological Park Summer Special Arrangements : ఎండ తీవ్రతకు మనుషులే కాదు పక్షులు, జంతువులు కూడా మాడిపోతున్నాయి. అడవిలో సంచరించేవి అయితే ఏ చెట్టు కిందో సేదతీరుతాయి. కానీ జూలో ఉండేవాటికి ఎంత చెట్టు కింద ఉన్నా అడవిలో ఉన్నంత చల్లదనం ఉండదు. అందుకే మూగజీవాలకు చల్లదనాన్ని అందించేందుకు హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శన శాల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్ప్రింక్లర్లు, కూలర్లలతో జంతువులకు చల్లదనాన్ని పంచుతున్నారు. జంతువులు ఉండే షెడ్డులపై గడ్డి, వెదురు, చాపలు, వట్టివేలు ఏర్పాటు చేసి వాటిపై నీళ్లు చల్లుతున్నారు.
Nehru Zoo Park in Hyderabad : జంతువుల సంరక్షణకు సంబంధించి అధికారులు సిబ్బందికి ప్రత్యేకంగా సూచనలు ఇస్తున్నారు. ఆరోగ్యపరంగా జంతువులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జంతు ప్రదర్శనశాల అధికారులు చెబుతున్నారు. ఈ సమ్మర్‌కు ముందు నుంచే ఎక్కడైనా ఎలాంటి సమస్యలు ఉన్నాయా అనేది తెలుసుకుని బాగుచేయడానికి ప్రాధాన్యతను ఇచ్చామని చెప్పారు.
"సమ్మర్ కోసం ఈసారి చాలా స్పెషల్‌గా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రస్తుతం ఉన్న జూలో గ్రీనరీ అనేది చాలా ఫోకస్‌గా చేశాం. జూ మొత్తం చెట్లు, పొదలు అనేవి ఎండిపోకుండా చూసుకున్నాం. జంతువులకు వేడి నుంచి రక్షణకు స్ప్రింక్లర్లు, రెయిన్ గన్స్ ఏర్పాటు చేశాం. ఎక్కడైనా రిపేర్ ఉంటే రెండు నెలల ముందే అందుకు తగ్గ చర్యలను చేపట్టాం. ప్రతి జంతువుకు థర్మామీటర్ ద్వారా టెంపరేచర్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నాం." - డా.సునీల్ హిరమత్, నెహ్రూ జంతు ప్రదర్శనశాల డైరెక్టర్ అండ్ క్యూరేటర్
వేడి నుంచి జంతువులకు ఉపశమనం : అధిక వేడిమి కారణంగా వన్య ప్రాణులకిచ్చే ఆహారంలో మార్పులు చేశారు. జంతువులకు నిరంతరం చల్లటి నీళ్లతో స్నానాలు చేయిస్తున్నారు. పక్షులు ఉండే ప్రాంతాల్లో చల్లగా ఉండేందుకు డ్రిప్ సహాయంతో వాటిపై నీటి తుంపర్లు పడే విధంగా ఏర్పాటు చేశారు. చలువ పందిళ్లు వేసి జంతువులు, పక్షులు సేద తీరేలా ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు వేడి వాతావరణాన్ని చల్లబరుస్తూ వన్యప్రాణులకు భానుడి తాపం నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు. జంతువులకు వడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సందర్శకులు హ్యాపీ : మూగజీవాలకు అందిస్తున్న సౌకర్యాల పట్ల సందర్శకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలే వేసవిలో ఎన్నో ఇబ్బందులు పడుతారని జంతువుల కోసం ఇలాంటి సౌకర్యాలు చేయడం పట్ల సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో జంతు ప్రదర్శనశాలకు వచ్చే పర్యాటకులు కోసం కూడా అధికారులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. చల్లటి తాగు నీటితో పాటు సేద తీరేందుకు షెడ్డులు ఏర్పాటు చేశారు.