Students Ragging in Boys Hostel at Narasaraopet: జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసి దారుణంగా హింసించి పైశాచిక ఆనందం పొందిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. ర్యాగింగ్‌కు సంబంధించిన వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాల బాయ్స్ హాస్టల్లో జూనియర్ విద్యార్థులను సీనియర్లు విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. సీనియర్ విద్యార్థులు జూనియర్లను ఊతకర్రతో చితకబాది పైశాచిక ఆనందం పొందారు. ఘటనకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 2న జరిగిన ఘటన : వీడియో వైరల్‌గా మారడంతో నరసరావుపేట ఒకటో పట్టణ సీఐ, పోలీసు సిబ్బంది కళాశాల హాస్టల్‌కు చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. వీడియోలో సీనియర్ విద్యార్ధుల చేతుల్లో దెబ్బలు తిన్న జూనియర్ విద్యార్థులను పిలిచి సీఐ చింతల కృష్ణారెడ్డి విచారించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ఈ ఘటన జరిగినట్లు విచారణలో తేలిందని ఒకటో పట్టణ సీఐ చింతల కృష్ణారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఘటనకు పాల్పడ్డ సీనియర్ విద్యార్ధులు పాస్ అయ్యి హాస్టల్ నుంచి వెళ్లిపోయినట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు.
ఘటనకు పాల్పడ్డ విద్యార్థులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని నరసరావుపేట సీఐ అన్నారు. అనంతరం నరసరావుపేట సీపీఐ నాయకుడు కాసా రాంబాబు, ఏఐఎస్ఎఫ్ సంఘ నాయకులు కళాశాల బాయ్స్ హాస్టల్‌కు చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. ఘటనకు సంబంధించి ర్యాగింగ్‌కు పాల్పడ్డ సీనియర్ విద్యార్ధుల తీరును ఖండించారు. కళాశాల హాస్టల్లో జరుగుతున్న పైశాచిక కార్యక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకుడు కాసా రాంబాబు, ఏఐఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు.
కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం - 78 మంది విద్యార్థుల సస్పెండ్