Telangana Student Died in America : అగ్ర రాజ్యం అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ యువకుడు హనుమకొండకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుమారుడు చనిపోయాడంటూ సమాచారం రావడంతో తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కనీసం మృతదేహాన్ని అయినా తెప్పించండంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, హనుమకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేశ్ 2016లో అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఎమ్మెస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. మధ్యలో రెండుసార్లు స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. గత సంవత్సరం తండ్రి చనిపోయినా అంత్యక్రియలకు రాలేకపోయాడు. తండ్రి సంవత్సరికానికి వస్తానని చెప్పాడు. కానీ ఇంతలోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. రాజేశ్ చనిపోయాడంటూ సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎక్కడకు పోయావురా కొడుకా అంటూ ఫొటో పట్టుకుని ఆ తల్లి ఏడవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
గతేడాదే తండ్రి మరణం : గతేడాది గుండెపోటుతో భర్త చనిపోగా, ఇప్పుడు కుమారుడు మరణించడంతో ఆ తల్లి వేదనకు అంతులేకుండా పోయింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లి, యాక్సిడెంట్లో కాళ్లు పోయి కదల్లేకుండా ఉన్న అక్క ఆర్థిక ఇబ్బందులతో ఏం చేయాలో తెలియక తల్లడిల్లుతున్నారు. ప్రభుత్వ సాయం చేసి రాజేశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని కోరుతున్నారు. కుమారుడి మృతదేహాన్ని తీసుకురావాలని ఆ తల్లి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది.
"పై చదువుల కోసం నా కుమారుడు అమెరికా వెళ్లాడు. అక్కడ మంచిగా చదువుకొని ఉద్యోగం సంపాదించాడు. అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అంతా బాగుందని భావించాం. గతేడాది నా భర్త చనిపోయాడు. తన తండ్రి చివరిచూపులకు నా కుమారుడు రాలేకపోయాడు. తండ్రి సంవత్సరికానికి వస్తానని చెప్పాడు. ఇంతలోనే మీ కుమారుడు చనిపోయాడని నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఇప్పటికే కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. దయచేసి ప్రభుత్వమే నా కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాల్సిందిగా వేడుకుంటున్నాం." - మృతుడి తల్లి
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి - అనుమానాస్పద స్థితిలో సిద్దిపేట యువకుడి మృతి
అమెరికాలో రోడ్డు ప్రమాదం - తెలంగాణ విద్యార్థిని మృతి - Telangana Student Died in America