Srisailam Dam 10 Gates Lifted : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయం జలకళ సంతరించుకుంది. వరద ప్రవాహం పెరగడంతో, అధికారులు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 2లక్షల 76వేల 620 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి శ్రీశైలానికి 3 లక్షల 37వేల 891 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.
శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.10 అడుగులుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 210.51 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసి దిగువ నాగార్జున సాగర్‌కు 56వేల 446 క్యూసెక్కుల ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 24 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 16 వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం - 10 గేట్లు ఎత్తి నీటి విడుదల - Srisailam Dam Gates Lifted
CM Chandrababu Srisailam Tour : గురువారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం వెళ్లనున్నారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించనున్నారు. నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అనంతరం సత్యసాయి జిల్లా పర్యటనకు సీఎం వెళ్లనున్నారు.
Heavy Flood Flow To Nagarjuna Sagar : నాగార్జున సాగర్ జలాశయం జలకళ సంతరించుకుంది. గత వారం రోజులుగా వరద ప్రవాహం పెరగడం, శ్రీశైలం జలాశయ గేట్లెత్తడంతో నీటి ప్రవాహం మరింత ఎక్కువైంది. దీంతో సందర్శకుల తాకిడి కూడా బాగా పెరిగింది. ప్రాజెక్టును పర్యాటకులు సందర్శిస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 515.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 140.49 టీఎంసీలకు చేరుకుంది.
నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో లక్షా 4వేల 2వందలు క్యూసెక్కులు వస్తోంది. సాగర్ కుడి కాల్వకు 5వేల 944 క్యూసెక్కులు నీరు, ఎస్ఎల్బీసీకి తాగునీటి 450 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం నీరు ప్రవాహం పెరుగుతుండడంతో ఎడుమ కాలువ కింద రైతన్నలు సాగుకు సిద్ధం అవుతున్నారు. కాగా సాగు నీటి విడుదలపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.