Sri Rama Navami Celebrations in Telangana : శ్రీరామ నవమి వేళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జగదాభిరాముడి కల్యాణం వైభవంగా నిర్వహించారు. రాములోరి పరిణయం తిలకించడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవాల్లో విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు.
కొండగట్టు అంజన్న క్షేత్రంలో శాస్త్రోక్తంగా స్వామి వారి కల్యాణ తంతు నిర్వహించారు. అంజన్న క్షేత్రం రామనామ జపంతో మార్మోగింది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు, అనంతరం ఉత్సవమూర్తులను కల్యాణ మండపంలో అధిష్టింపజేసి వైభవంగా వివాహం జరిపించారు.
Minister Sridhar Babu Attend in Navami Festivals : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలో జరిగిన స్వామివారి కల్యాణ వేడుకల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సతీమేతంగా పాల్గొన్నారు. జానకిరాముడి అడుగుజాడల్లో నడుస్తూ నీతి నిజాయితీగా ధర్మ పాలన సాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి స్వగృహంలో ఉత్సవ విగ్రహాలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు.
నల్గొండ రామగిరిలోని రామాలయంలో జరిగిన ఉత్సవాలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. శాస్త్రోక్తంగా జరిగిన క్రతువులో భక్తులు అశేషంగా పాల్గొని తన్మయత్వం పొందారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూర్, ఇబ్రహీంనగర్‌లో జరిగిన స్వామివారి పెళ్లి వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. కరవు పరిస్థితులు తొలగిపోయి, సమృద్ధిగా వర్షాలు కురవాలని మొక్కుకున్నట్లు తెలిపారు. దుబ్బాక మండలం పోతారంలో నీలిమేఘశ్యాముడి పెళ్లి వేడుకలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దంపతులు హాజరయ్యారు.
Sitarama Kalyana Mahotsavam 2024 : మెదక్ కోదండ రామాలయంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు దంపతులు పల్లకి సేవలో పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా రాములోరి కల్యాణ క్రతువును జనం భక్తి ప్రపత్తులతో నిర్వహించుకున్నారు. వరంగల్, కాజీపేటల్లోని ఆలయాలు శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కోదండ రామాలయంలో నిర్వహించిన ఉత్సవాలకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు హాజరయ్యారు.
పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరై పూజలు నిర్వహించారు. కాసిపేట మండలం ధర్మరావుపేటలో జరిగిన వేడుకల్లో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. నిజామాబాద్ ఖిల్లా రామాలయం, సుభాష్‌నగర్ రామాలయాల్లో జరిగిన దైవిక కార్యక్రమానికి హాజరైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాల్ని స్వీకరించారు.
భాగ్యనగరంలో జగదభిరాముడి కల్యాణ వేడుకలు : డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంలో స్వామివారి పరిణయ వేడుకలో గ్రామీణ ఎమ్మెల్యే భూపతి రెడ్డి దంపతులు పాల్గొని పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌లో జరిగిన వేడుకల్లో చేవెళ్ల బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. భాగ్యనగరంలోనూ జగదభిరాముడి కల్యాణ వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించారు.
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని పురాతన రాములోరి ఆలయంలో జరిగిన స్వామివారి కల్యాణోత్సవాలకు మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు. బషీర్‌బాగ్ కనదుర్గ నాగలక్ష్మి దేవాలయం ఆధ్వర్యంలో నిజాం కళాశాల మైదానంలో జరిగిన వేడుకలకు జనం తరలివచ్చారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవత్ రావు, విశ్వహిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు.
రాముడి గుణాలు ఆదర్శంగా తీసుకుంటే - ప్రజల్లో పట్టాభిషేకమే! - Sri Rama Navami 2024
శ్రీరామనవమి తర్వాత రోజు ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం! - Sri Rama Navami 2024