Sriram Sagar Water Projects Gates Repair Actively : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. మిగులు జలాలు గోదావరిలోకి విడుదల చేయడానికి శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు 42 వరద గేట్లున్నాయి. ఒక్కో గేటు 50 అడుగుల వెడల్పు, 33 అడుగుల ఎత్తు ఉన్నాయి. అన్నింటితో ఏకకాలంలో 16 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యం ఉంది. ఏటా నిర్వహణ మరమ్మతులు చేపడుతున్నా, నలభై ఏళ్లుగా పూర్తిస్థాయి మరమ్మతులు జరగలేదు.
అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా నిధులు విడుదల చేయడంతో 2022 జూన్‌లో అప్పటి మంత్రి ప్రశాంత్‌రెడ్డి మరమ్మతు పనులు ప్రారంభించారు. ఆ తర్వాత పది రోజులకే వరదలు రావడం, జలాశయం నిండడంతో పనులు నెమ్మదిగా సాగాయి. వర్షాలు తగ్గి నీటి విడుదల నిలిచాక పనులు కొనసాగాయి. 2023 జులైలోనే ప్రాజెక్టు నిండడంతో మళ్లీ పనులు నెమ్మదించాయి. నిండుగా నీరున్నప్పుడు సైతం స్టాప్ లాక్ గేట్లను దించి వరద గేట్లకు మరమ్మతులు చేపట్టారు.
ప్రత్యేకంగా తెప్పించిన ఇసుకతో గేట్లకు స్యాండ్ బ్లాస్టింగ్ : శ్రీరామసాగర్ ప్రాజెక్టులోని 33 గేట్ల పనులు పూర్తవగా, మిగతా వాటి పనులు కొనసాగుతున్నాయి. వైస్రోప్స్, టర్న్ బక్కల్, రబ్బర్ సీల్స్ మార్చడం, గేట్లకు రంగులు వేయడం చేస్తున్నారు. ప్రత్యేకంగా తెప్పించిన ఇసుకతో గేట్లకు స్యాండ్ బ్లాస్టింగ్ సైతం చేయిస్తున్నారు. గేట్లకు సింగిల్ కోటింగ్ కలర్ వేసినా అన్నింటికి చివరగా రంగులు వేయాల్సి ఉంది.
ఈ సీజన్‌లో రుతుపవనాలు తొందరగానే వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. మళ్లీ వరదలు వస్తే పనులు ఆగిపోయే అవకాశం కూడా ఉంది. పనుల పూర్తికి మరో రెండు నెలలు సమయం పడుతుందని, వరదలు వచ్చినా పనుల పూర్తికి ప్రయత్నం చేస్తామని అధికారులు అంటున్నారు. పనులు సకాలంలో పూర్తి చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
తెలంగాణ తొలి సాగునీటి ప్రాజెక్టు : రాష్ట్రంలో గోదావరి నదిపై చేపట్టిన తొలి సాగునీటి ప్రాజెక్టు ఇదే. ప్రస్తుతం ఎస్సారెస్పీ ద్వారా, ఎగువ మానేరు కింద నిజామాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, దిగువ మానేరు కింద కరీంనగర్‌లోని కొన్ని ప్రాంతాలు, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు సాగునీరు లభిస్తోంది.
1969లో శ్రీరాంసాగర్ జలాశయం పనులు ఊపందుకోగా, 1978 సంవత్సరంలో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 1093 అడుగులతో 112 టీఎంసీల సామర్థ్యంతో వరద ప్రవాహాన్ని తట్టుకునేలా సువిశాలమైన బండరాయిని ఎంచుకుని ప్రాజెక్ట్‌ని 140 చదరపు అడుగుల ఎత్తుతో, 3,143 అడుగుల పొడువుతో రాతికట్టడం, 125 అడుగుల ఎత్తుతో 475 అడుగుల పొడవు మట్టికట్టడంతో మొత్తం 47,893 అడుగుల బ్యారేజీ నిర్మించారు.
SRSP Project 60 Years : 60 వసంతాలు పూర్తి చేసుకున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్.. మీకు ఇవి తెలుసా..?