Telangana Phone Tapping Case Updates : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యారు. దర్యాప్తులో ఇంకా కొత్త అంశాలు తెర మీదకొస్తున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి వెంకట రమణా రెడ్డిపై నిరంతరం నిఘా ఉంచారని దర్యాప్తులో గుర్తించారు.
WhatsApp groups in Phone Tapping Case : ఎస్ఐబీ మాజీ డీఎస్సీ ప్రణీత్ రావు నేతృత్వంలో ప్రత్యేకంగా కేఎంఆర్ పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. గతంలో ఎస్ఐబీ అదనపు ఎస్పీగా ఉన్న తిరుపతన్నతో పాటు, అతడి పర్యవేక్షణలో పని చేసే పోలీసులను గ్రూపులో సభ్యులుగా చేర్చారు. రేవంత్ రెడ్డి, వెంకటరమణారెడ్డి ప్రధాన అనుచరుల కదలికలను పరిశీలిస్తూ గ్రూపులో చర్చించుకునే వారని దర్యాప్తులో గుర్తించారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఆర్థిక వనరులు అందకుండా చేసే ఉద్దేశంతో ప్రణాళికలు రచించినట్లు నిర్ధారించారు.
ప్రత్యర్థి పార్టీల కదలికలపై పర్యవేక్షణ : అదనపు ఎస్పీ తిరుపతన్న పోల్-2023 పేరిట మరో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. తన బృందంలోని పోలీసులను అందులో సభ్యులుగా చేర్చారు. ఎన్నికల వేళ అనధికారంగా సొమ్మును జప్తు చేసి, ఆ వివరాలను ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసుకునేవారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నేతల కదలికలపై తిరుపతన్న బృందం పర్యవేక్షణ ఉండేది. సొమ్ము తరలిస్తున్నట్లు సమాచారం వస్తే టాస్క్‌ఫోర్స్‌తో పాటు ఇతర క్షేత్రస్థాయి పోలీస్ బృందాలకు సమాచారం అందేది.
ఫోన్ ట్యాపింగ్ కేసు - విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్‌రావును విచారించిన పోలీసులు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేయగా, తాజాగా మరో ఇద్దరిని నిందితుల జాబితాలో చేర్చారు. ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును ఏ1-గా, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్‌రావును ఏ6-గా చేరుస్తూ నాంపల్లి కోర్టులో రెండు రోజుల క్రితం మెమో దాఖలు చేశారు. ఈ కేసులో వీరిద్దరు పరారీలో ఉన్నట్లు న్యాయస్థానానికి దర్యాప్తు బృందం వెల్లడించింది. ఇప్పటివరకు నిందితుల వాంగ్మూలాల్లో వీరిద్దరి ప్రస్తావన వచ్చినా, సాంకేతిక కారణాలతో పేర్లను చేర్చలేదు. తాజాగా వీరిని పరారీలో ఉన్న నిందితులుగా చూపడం చర్చనీయాంశంగా మారింది.
SIB Ex DSP Praneeth Rao Case Updates : ప్రభాకర్‌రావు, శ్రవణ్ విదేశాల్లో ఉన్నారని, వారి అరెస్ట్‌కు అనుమతిస్తూ వారెెంట్ జారీ చేయాల్సిందిగా సీఆర్పీసీ-73 సెక్షన్ కింద కోర్టును పోలీసులు అభ్యర్థించారు. ఈ విషయంలో సోమవారం న్యాయస్థానం నిర్ణయం వెలువడనుంది. కోర్టు వారెంట్లకు అనుమతిస్తే, ప్రభాకర్ రావు, శ్రవణ్‌రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించే అవకాశముంది. ఇందుకోసం తెలంగాణ సీఐడీ విభాగం నుంచి సీబీఐకి సమాచారమిచ్చి, అక్కడి నుంచి ఇంటర్‌పోల్‌కు లేఖ రాయించాల్సి ఉంటుంది. అప్పుడు వారికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే అవకాశముంది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయితే, ఇంటర్‌పోల్ సభ్యదేశాల్లో నిందితులు ఉంటే అక్కడి పోలీసుల ద్వారా అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చే అవకాశముంటుంది.
ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త కోణాలు - పోలీసులే సాక్షులు, వారి వాంగ్మూలాలే ఆధారాలు