School Bank Of Warangal : పైసా.. పైసా.. పోగేసి విద్యార్థులు చేసిన ఒక ప్రయోగం, వారి పాలిట పొదుపు మంత్రమైంది. వారి జీవితానికి చదువు ఎంత ప్రాముఖ్యమైనదో ‘ఆర్థిక పాఠాలూ’ అంతే అవసరమని ఆచరణలో చూపిస్తున్నారు. వృథా ఖర్చు తగ్గించి మదుపు చేసిన అమౌంట్, వారి అవసరాలను తీర్చుతోంది. పిల్లలే బ్యాంకర్లుగా ప్రతి రోజూ ప్రారంభ నిల్వ, జమ, వసూలు, ముగింపు నిల్వ వంటివి ఆర్డర్లో నిర్వహించడం ఔరా అనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గవర్నమెంట్ పాఠశాలల్లో పిలలు నడుపుతున్న ‘స్కూల్ బ్యాంకుల’పై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
School Bank Children of Chilpur : జనగామ జిల్లా చిల్పూరు ప్రభుత్వ పాఠశాలను రిజర్వ్ బ్యాంకు మెచ్చింది. అక్కడ సాంఘికశాస్త్రం టీచర్ శ్రీనివాస్, వెంకటేశ్వర్లు 8, 9 తరగతుల వారికి ఆర్థిక అక్షరాస్యత బోధిస్తున్నారు. ‘స్కూల్ బ్యాంక్ చిల్డ్రన్ ఆఫ్ చిల్పూరు’ను 2022లో 161 మంది స్టూడెంట్స్ రూ.3 వేలతో ప్రారంభించారు. ప్రస్తుతం 119 మంది విద్యార్థులు పొదుపు చేస్తుండగా రూ.60,314 జమయ్యింది. ఇద్దరు పిల్లల తండ్రులు మరణిస్తే ఈ సొమ్ము నుంచే ఆర్థిక సాయం చేశారు. స్పోర్ట్స్ యూనిఫాం కొనుగోలుకు ఉపయోగించారు. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న వరద బాధితుల సహాయార్థం రూ.5 వేలు ‘ఈనాడు’ సహాయ నిధికి పంపారు. వీరి పనితీరుకు మెచ్చిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.20 వేల విలువైన బీరువా, నాబార్డు సంస్థ ట్యాబ్‌ను అందించిందని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ పేర్కొన్నారు.
పైసల విలువ తెలిసేలా :
హనుమకొండ జిల్లా నడికూడ మండలం చర్లపల్లి ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులు చదువుతో పాటు ఆర్థిక క్రమణశిక్షణ ముఖ్యమని భావించారు. గతేడాది చిల్డ్రన్స్ డే సందర్శంగా బడిలో ‘బ్యాంక్ ఆఫ్ చర్లపల్లి’ని హెచ్‌ఎం అచ్చ సుదర్శన్ ప్రారంభించారు. ప్రస్తుతం 81 మంది స్టూడెంట్స్ పొదుపు చేస్తున్నారు. రూ.15 వేల వరకు జమ ఉంది. పిల్లలు అవసరమైనప్పుడు విత్‌డ్రా చేసుకుని పెన్నులు, బుక్స్, పెన్సిళ్లు కొనుగోలు చేసుకుంటున్నారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మచిల్పూరు :
బడి స్ఫూర్తిగా మర్రిపల్లిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది విజయదశమి పురస్కరించుకుని బయాలజీ టీచర్ విజేందర్ ‘స్కూల్ బ్యాంక్ ఆఫ్ మర్రిపల్లిగూడెం’ ప్రారంభించారు. చిల్పూరు బడి బ్యాంక్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఆచరణలో పెట్టారు. పాఠశాలలో 80 మంది విద్యార్థులుండగా 70 మందితో డబ్బులు పొదుపు చేయిస్తున్నారు. ప్రెజెంట్ రూ.8 వేల నిల్వ ఉన్నాయి. అవసరమైనప్పుడు చిన్నారులు విత్‌డ్రా చేసుకుంటున్నారని హెచ్‌ఎం రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు.
చిన్నారులతో కమిటీ :
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం వెంకట్యాతండా (సరిహద్దుతండా)లోని ఎంపీపీఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు బి.వీరన్న 2022లో కిడ్డీబ్యాంక్‌ను ప్రారంభించారు. 28 మంది విద్యార్థులతో పొదుపు చేయించడం మొదలుపెట్టగా, అందులో ఇద్దరు బాలలతో కమిటీ ఏర్పాటు చేశారు. ఏటా రూ.9 వేల నుంచి రూ.12 వేలు దాకా నిల్వచేస్తున్నారు. తద్వారా పిల్లలు తమకు కావాల్సిన రాతపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, బడి బ్యాగులు, ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు.
బాలలకు కలిగే ప్రయోజనాలు ఇవి
✿ చిన్నారులకు ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది..
✿ నిజమైన బ్యాంకు కార్యకలాపాలు, లావాదేవీల గురించి అంచనా తెలుస్తుంది.
✿ చిరుతిళ్లను మానుకొని హెల్తీగా ఉంటారు.
✿ విద్యకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోవడంతో పాటు ఆపదలో ఉన్న స్నేహితులకు తోడ్పాటు ఇవ్వగల్గుతారు.
✿ ఏడాదిలో అందరూ కలిసి అలా విహారయాత్రకు వెళ్లేందుకు అవసరమైన డబ్బులు సమయానికి వాడుకునేందుకు దోహదపడతాయి.
స్కూల్ బ్యాంకుల నిర్వహణ ఇలా :
✿ నిజమైన బ్యాంకు మాదిరిగానే ప్రతి విద్యార్థికి పాస్ బుక్ ఉంటుంది.
✿ ప్రారంభ నిల్వ, జమ, వసూలు, ముగింపు నిల్వలకు సంబంధించి ఆర్డర్లో ఒక పుస్తకంలో రాస్తారు.
✿ జమ, విత్‌డ్రా చేసినప్పుడు వోచర్స్ సైతం ఇస్తారు.
✿ బడి వేళలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో విద్యార్థులే బ్యాంకు వ్యవహారాలను చూస్తారు.
మీ పిల్లలు ఎక్కువగా ఫోన్ చూస్తున్నారా - 'స్మార్ట్ జాంబీ'లుగా మారారేమో చూడండి!
'బంధువుల ముందు అరాచకం చేస్తారు.. తల్లిని కొడుతుంటారు' - పిల్లల ప్రవర్తనను ఎలా మార్చాలి?