SPDCL Serious On False Publicity : విద్యుత్ సరఫరాపై ఎక్స్ వేదికగా కొన్ని గ్రూపుల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని ఎస్పీడీసీఎల్ సంస్థ ఆరోపించింది. ఆ పోస్టింగులను కోట్ చేస్తూ దక్షిణ డిస్కం ట్విటర్ హ్యాండిల్‌కు వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తున్నారని, మరికొంత మంది తమ సర్వీస్ వివరాలు పెట్టకుండా అసత్య ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుని పోస్టింగులు పెడుతున్నారని సంస్థ ముఖ్య అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందువల్ల ఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిజమైన వినియోగదారులు ఎవరో కనిపెట్టడంలో సంస్థ పలు సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటుందని పేర్కొంటున్నారు.
SPDCL On False Tweets : ఇటీవల హైదరాబాద్ నాంపల్లిలోని డిస్ట్రిక్ట్ క్రిమినల్ కోర్ట్‌లో ఎంసీబీ ట్రిప్పింగ్‌తో ఏర్పడ్డ అంతర్గత సమస్య వల్ల సరఫరాలో అంతరాయం జరిగితే, కోర్ట్‌లో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుండగా పవర్ కట్ చీకటిలోనే వాదనలు విన్న జడ్జి అని 'ఎక్స్'లో అసత్య సమాచారం పోస్ట్ చేశారని ఎస్పీడీసీఎల్ అధికారులు వెల్లడించారు. దీనికి స్పందనగా ఈ అంశంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు.
గతంలో కూడా అసెంబ్లీలో విద్యుత్ అంతరాయం అని అసత్య ప్రచారం చేశారన్నారు. వాస్తవానికి అసెంబ్లీలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేదని ఈ ఘటనపై కూడా పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు అధికారులు తెలిపారు. గత కొద్దీ రోజులుగా ఎస్పీడీసీఎల్ ట్విటర్ ద్వారా విద్యుత్ సరఫరా అంశానికి సంబంధించి నమోదయ్యే ఫిర్యాదులు 20 నుండి 30 వరకు ఉంటున్నాయన్నారు.
TS SPDCL React on Fake News in Social Media : నిజంగా సరఫరా సమస్యలు ఎదుర్కొనే వినియోగదారులు తమ సర్వీస్ నెంబర్, ఏరియా వంటి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తారన్నారు. కానీ గత కొద్దీ రోజులుగా కావాలని విద్యుత్ సంస్థను, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కొన్ని గ్రూపులు అసత్య ఫిర్యాదులు చేస్తున్నారని, ఫేక్ అకౌంట్స్ సృష్టించుకుని గత రెండు రోజులుగా లెక్కలేనన్ని అస్పష్టమైన, తప్పుడు వివరాలతో ట్వీట్లు చేస్తున్నారని ఎస్పీడీసీఎల్ అధికారులు ఆరోపించారు.
FAKE POWER BILLS: ' అదంతా అబద్ధం... అలా విద్యుత్ సరఫరా నిలిపివేయం'
అసత్య ప్రచారాల వల్ల సేవలు అందించడంలో జాప్యం : కొన్ని సార్లు ఎఫ్.ఓ.సీ సిబ్బంది, ట్వీట్లో పేర్కొన్న చిరునామాకు వెళ్లగా అక్కడ ఎలాంటి సమస్య ఉండటం లేదన్నారు. గ్రేటర్ పరిధిలో దాదాపు 68 లక్షల మంది వినియోగదారులున్నారు. అన్ని కేటగిరీల వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా వలన గతేడాది మే నెలలో వచ్చిన అత్యధిక డిమాండ్, వినియోగం ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే వచ్చింది.
నిరంతర సరఫరా వలన ఏప్రీల్ 18న 4,053 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్, 84.68 మిలియన్ యూనిట్ల వినియోగం, ఏప్రిల్ 19న 4,093 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్, 85.38 మిలియన్ యూనిట్ల వినియోగం రికార్డు స్థాయిలో నమోదైనట్లు విద్యుత్ శాఖ వెల్లడించింది. అసత్య ప్రచారం వల్ల వాస్తవంగా సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు నిర్ణీత సమయంలో నాణ్యమైన సేవలు అందించడంలో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని ఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు.
'విద్యుత్ వినియోగం పెరుగుతోంది.. అయినా ఇబ్బందులు రానీయం'
'బిల్లు కట్టలేదు కరెంట్ కట్ చేస్తా'మని ఫోన్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త!!