Dussehra 1400 Special Trains 2024 : తెలుగురాష్ట్రాల్లో దసరా సందడి మొదలైంది. సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అంతే కాకుండా దసరా సెలవులతో ఓపక్క తీర్థయాత్రలకు, మరోపక్క విహారయాత్రలకు వెళ్లే వారు చాలామందే ఉన్నారు. రోజూ ప్రధాన రైల్వే స్టేషన్లు అన్నీ రద్దీగా మారిపోయాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రద్దీని తట్టుకునేందుకు 760కి పైగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్న దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రత్యేక రైళ్ల సంఖ్యను 1,400లకు పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
పండుగల నేపథ్యంలో : దసరా, దీపావళి పండుగల సీజన్ నేపథ్యంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఉత్తర భారత రాష్ట్రాలైన బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి తూర్పు రాష్ట్రాలకు కూడా ప్రయాణీకుల రద్దీ భారీగా ఉంది. ప్రత్యేక రైళ్లను అక్టోబరు 1 నుంచి నవంబర్ 30 వరకు వేర్వేరు తేదీల్లో నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణీకుల సౌకర్యార్థం అదనపు బుకింగ్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ప్రత్యేక రైళ్లు తిరిగే మార్గాలివే : దక్షిణ మధ్య రైల్వేలోని ప్రధాన స్టేషన్లయిన తిరుపతి, నిజాముద్దీన్, విశాఖపట్నం, సంత్రాగచ్చి, గోరఖ్‌పూర్, అగర్తల, రక్సాల్, నాగర్‌సోల్, దానాపూర్, శ్రీకాకుళం, నాగ్‌పూర్, మాల్డా టౌన్, పాట్నా, షాలిమార్, షిర్డీ, సోలాపూర్, పూణే, ముంబయి, జైపూర్ తదితర మార్గాలలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లలో రిజర్వుడ్ కోచ్‌లు, అన్ రిజర్వుడ్ కోచ్‌లను ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
నవరాత్రి స్పెషల్ థాలీ : దక్షిణ మధ్య రైల్వేలో రిజర్వ్ చేయని కోచ్‌ల ద్వారా ప్రయాణించాలనుకునే ప్రయాణీకుల కోసం జనరల్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడకుండా తమ టిక్కెట్లను మొబైల్ యాప్‌లో, యూటీఎస్ ద్వారా కొనుగోలు చేసుకొనే అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, తిరుపతి స్టేషన్లతో సహా మొత్తం రైల్వేవ్యవస్థలో 150కి పైగా రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల కోసం నవరాత్రి స్పెషల్ థాలి పేరుతో ప్రత్యేక భోజన సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ స్పెషల్ థాలిని ఐఆర్సీటీసీ మొబైల్ యాప్, రైల్వే అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో ఆర్డర్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ఆ రూట్లలో వెళ్లేవారికి 'హ్యాపీ జర్నీ' - 644 'దసరా స్పెషల్' ట్రైన్స్ - railway stations rush
పండగల వేళ 6000 ప్రత్యేక రైళ్లు - రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి