Son And Mother Stuck in Flood by Using Google Map to Reach Vijayawada : గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని ఏపీలోని విజయవాడకు వెళ్లాలనుకున్న ఓ యువకుడు తన తల్లితో కలిసి వరదలో చిక్కుకుపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కారు చుట్టూ వరద, తలుపులు లాక్ పడి బయటకు రాలేని పరిస్థితుల్లో ఆ యువకుడు కంట్రోల్ రూమ్ సాయం కోరాడు. అధికారులు వేగంగా స్పందించి స్థానికుల సాయంతో కాపాడారు.
Google Map Misdirection In AP : ఏపీలోని విజయవాడ రూరల్ మండలం నున్నకు చెందిన కైలే గౌతమ్ విజయవాడలో పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. పది రోజులుగా వరద కారణంగా సొంతింటికి వెళ్లడం కుదరని గౌతమ్, యనమలకుదురులోని బంధువులు, స్నేహితుల గదిలో ఉంటూ కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు. శుక్రవారం వాతావరణం తెరిపినివ్వడంతో ధైర్యం చేసి గన్నవరం మండలం పురుషోత్తపట్నం మీదుగా నున్న వెళ్లిన గౌతమ్, తిరిగి తల్లి రమా కుమారితో కలిసి గూగుల్ మ్యాప్ సాయంతో విజయవాడకు బయలుదేరారు.
ఆ మ్యాప్ సావరగూడెం - కేసరపల్లి మీదుగా చూపడంతో ఆ మార్గంలో వరద వస్తుందన్న విషయం తెలియని గౌతమ్, తన కారుతో 150 మీటర్ల దూరం ముందుకొచ్చారు. వరద ఎక్కువగా ఉండటంతో కారు సడన్‌గా ఆగిపోవడంతో తలుపులు తీసేందుకు యత్నించారు. ఎంతసేపటికీ కారు అద్దాలు తెరుచుకోకపోవడంతో తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్, పలువురు నాయకులకు ఫోన్ చేసి విషయం తెలిపాడు.
వరదలో కొట్టుకుపోతున్నామని, తమ ప్రాణాలు కాపాడాలంటూ గౌతమ్ చేసిన ఫోన్ కాల్‌కు అధికారులు వేగంగా స్పందించారు. వెంటనే గ్రామ రెవెన్యూ అధికారికి, పంచాయతీ సిబ్బందికి పైఅధికారులు తెలియజేశారు. వెంటనే క్షేత్రస్థాయి అధికార సిబ్బంది స్థానికులను అప్రమత్తం చేశారు. పంచాయతీలో పని చేసే మత్స్యకారుడైన లంకే నాగేశ్వరరావు, గజ ఈతగాడు అర్జా సుదర్శనంతో పాటు కొంతమంది గ్రామస్థులు కారు అద్దాలు పగులకొట్టి గౌతమ్, అతని తల్లిని రక్షించి ఒడ్డుకు చేర్చారు.
వెంటనే స్పందించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన వారికి, ప్రభుత్వానికి గన్నవరం శాసన సభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ధన్యవాదాలు తెలిపారు. గతేడాది సావరగూడెం చెరువులో పడిన ఇద్దరు విద్యార్థులను బయటకు తీసుకొని రావడంలో అర్జా సుదర్శనం కీలకంగా వ్యవహరించారు. గజ ఈతగాడు సుదర్శనం సేవలను పలువురు ప్రశంసించారు.
లైన్ దాటి యువతిని ఢీకొట్టి - వనస్థలిపురంలో కారు బీభత్సం - Road Accident In Hyderabad
ట్రాఫిక్ పోలీసుల సమయస్ఫూర్తి - ప్రాణాలతో బయటపడ్డ ఫ్యామిలీ - Traffic Police Who Saved A Family