Skin Problems by Jeans Pants : చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎక్కువ శాతం మంది జీన్స్ ప్యాంట్లు ధరించడం ప్రస్తుత రోజుల్లో ఫ్యాషన్‌గా మారిపోయింది. ఉతక్కపోయినా, ఇస్త్రీ చేయకపోయినా వేసుకోవడానికి సౌకర్యంగా ఉండటం, రఫ్ అండ్ టఫ్‌గా ఉండటంతో చాలామంది ఈ దుస్తులపై ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా ఒకటి రెండుసార్లు వేసుకున్న తర్వాత ఉతికి మళ్లీ ధరిస్తే పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు.
చాలా మంది వారం పది రోజులు అలాగే ధరించడంతో చర్మ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. జీన్స్ ప్యాంట్లు స్కిన్‌ఫిట్‌లాగా ఉండటంతో గాలి ఆడక లోపల చెమట పట్టి వివిధ రకాల సమస్యలకు దారి తీస్తున్నాయి. వీటి ద్వారా గజ్జి (స్కేబిస్), దద్దుర్లు (అర్టికేరియా), తామర (ఆటోపిక్ డెర్మటైటిస్) వంటి సమస్యలతో చాలామంది డాక్టర్లను సంప్రదిస్తున్నారు.
స్కిన్ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు :
- చర్మం రంగు మారడం
- సహజత్వం కోల్పోవడం
- ఎర్రగా దద్దుర్లు రావడం
- పాలిపోయినట్లు కనిపించడం
- మంట, దురద, వాపు
- పుండుగా మారి చీము కారడం
- చర్మం దళసరిగా మారడం
ఏదో ఒక సమస్యతో ఆసుపత్రులకు : 0-18 వయసు గల పిల్లలు, యువతలో 30-40 శాతం మంది ఏదో ఒక స్కిన్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ప్రధానంగా పౌష్టికాహార లోపం, గాలి, వెలుతురు సోకని ఇళ్లలో పరిమితికి మించి ఉండటం, అపరిశుభ్రత, జన్యు ఇబ్బందులు, కాలుష్యం తదితర కారణాలు దోహదం చేస్తున్నాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఉప్పు ఉన్న జంక్‌ఫుడ్, అధిక చక్కెర, నూనెలు తీసుకోవడంతో యువతలో మొటిమలు వస్తున్నాయని తెలిపారు.
చర్మ సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- వ్యక్తిగత శుభ్రత పాటించడం
- చర్మం మాయిశ్చరైజర్‌గా ఉంచుకోవడం
- షర్ట్, ప్యాంటు రెండ్రోజులకు మించి వాడకపోవడం
- తగినంత నీళ్లు తాగడం
- నిత్యం 30 నిమిషాల పాటు వ్యాయామం
- అలర్జీల నివారణకు చికిత్స
- ఆహారంలో ఆకు కూరలు, పండ్లు ఉండేలా చూడటం
- స్ట్రాబెర్రీలు, యాపిల్స్, పుచ్చకాయ, అరటి పండ్లు తీసుకోవడం
- రోజులో కొంత సమయం చర్మానికి ఎండ తగిలేలా చూడటం
- చర్మం కాలుష్యం బారిన పడకుండా దుస్తులు ధరించడం
- జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండటం
- సమస్య ఉంటే వైద్యున్ని సంప్రదించాలి.
ఉస్మానియాలో ప్రత్యేక విభాగం : స్కిన్ సంబంధిత సమస్యలకు ఉస్మానియా ఆసుపత్రిలో ప్రత్యేక విభాగం అందుబాటులోకి తెచ్చినట్లు డెర్మటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ భూమేష్‌కుమార్ పేర్కొన్నారు. ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. నిత్యం 100 మంది వరకు ఓపీ వస్తుండగా, 0-18 సంవత్సరాలలోపు వారు ఎక్కువగా ఉంటున్నారు. తీవ్రమైన చర్మ వ్యాధి లక్షణాలు ఉంటే బయాప్సీ పరీక్షలు చేస్తామని చెబుతున్నారు. పిల్లల కోసం పిడియాట్రిక్ డెర్మటాలజీ శిక్షణ కేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు. డీఎం తర్వాత పిడియాట్రిక్ డెర్మటాలజీలో ఫెలోషిప్ అందిస్తున్నట్లు వెల్లడించారు.