Singareni Paricipate Coal Mine Auction Today : దేశంలో కొత్త బొగ్గు గనుల వేలానికి కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే ఆ దిశగా బొగ్గు గనుల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటి వరకు ఒక్కో నగరంలో బొగ్గు గనుల వేలం నిర్వహిస్తూ వచ్చిన కేంద్రం, ఈసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తుంది. ఈ మేరకు నేడు మధ్యాహ్నం వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే వేలంలో తొలిసారిగా సింగరేణి సంస్థ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కేంద్రం బొగ్గు గనుల వేలాన్ని నిర్వహించబోతుంది. వేలానికి పెట్టిన గనుల్లో సింగరేణి సమీపంలోని శ్రావణపల్లి బొగ్గు గని కూడా ఉంది. అక్కడ 11.99 కోట్ల టన్నుల బొగ్గు గనుల నిల్వలున్నట్లు భూగర్భ సర్వేలో తేలింది. శ్రావణపల్లి బొగ్గు గనిని వేలంలో దక్కించుకునేందుకు సింగరేణి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం తొలిసారిగా సింగరేణి సంస్థ గనుల వేలంలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా ఉన్న 60 బొగ్గు గనులకు కేంద్ర ప్రభుత్వం వేలం నిర్వహిస్తుంది. హైటెక్ సిటీలోని మైండ్ స్పేస్ వేదికగా వేలం నిర్వహించనున్నారు. 10వ విడత బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేడు మధ్యాహ్నం ప్రారంభిస్తారు. ఆ శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, కార్యదర్శి అమృత్ లాల్ మీనాతోపాటు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా వేలం నిర్వహణ కార్యక్రమంలో పాల్గొంటారు. సింగరేణి సంస్థ గతంలో ఎప్పుడూ బొగ్గు గనుల వేలంలో పాల్గొనలేదు. గతంలో నిర్వహించిన బొగ్గు గనుల వేలానికి సంస్థ దూరంగా ఉండడంతో సత్తుపల్లి-3, కోయగూడెం బొగ్గు గనులను ప్రైవేటు బొగ్గు కంపెనీలు దక్కించుకున్నాయి.
ఈసారి ఎలాగైనా శ్రావణపల్లి బొగ్గు గనులను సింగరేణి సంస్థ దక్కించుకోవాలనుకుంటోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. ఈసారి వేలంలో పాల్గొనాలని సంస్థ భావిస్తుంది. వేలంలో గనులు దక్కించుకుంటే అక్కడ తవ్వకాలు జరిగి విక్రయించే బొగ్గు విలువలో కనీసం 4 శాతానికి పైగా రాయల్టీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సి ఉంటుంది.
దేశం మొత్తం 60 బొగ్గు గనులకు వేలం : నేడు బొగ్గు గనులకు నిర్వహించే వేలంలో ఒడిశాలోని 16, మధ్యప్రదేశ్‌లోని 15, ఛత్తీస్‌గఢ్‌లోని 15 బొగ్గుగనులు, జార్ఖండ్‌లోని 6, బిహార్, బెంగాల్‌లోని చెరో 3 బొగ్గు గనులు, మహారాష్ట్ర, తెలంగాణాల్లోని ఒక్కో బొగ్గు గనికి మధ్యాహ్నం వేలం నిర్వహించనున్నారు. పర్సంటేజ్ రెవెన్యూ షేర్ మాడల్ ఆధారంగా ఆన్‌లైన్‌లో బొగ్గు గనుల వేలాన్ని నిర్వహిస్తారు. సింగరేణి సంస్థ పరిధిలో ఉన్న అన్ని బొగ్గు బ్లాకులను వేలం పాట ద్వారా కాకుండా నేరుగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికే కేటాయించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల వేలంపాటలో పెట్టిన సత్తుపల్లి, కోయగూడెం ఓపెన్ కాస్ట్ వేలంపాటదారులు ఇప్పటి వరకు ఆ గనులను చేపట్టలేదు. కావున వాటిని సింగరేణి సంస్థకు అప్పగించాలని భట్టి విక్రమార్క కేంద్రానికి సూచించారు.
త్వరలో కొత్త బొగ్గు గనుల వేలం - కొనుగోలు చేయాలనే యోచనలో సింగరేణి - Coal Blocks Auction 2024