Simhachalam Giri Pradakshina 2024: సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. తొలి పావంచ దగ్గర కొబ్బరి కాయ కొట్టి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. 32 కిలోమీటర్ల ఈగిరి ప్రదక్షిణలో 10 లక్షల మంది పాల్గొంటారనే అంచనాతో ఏర్పాట్లు చేసినా, అంతకు మించి భక్తులు తరలివచ్చారు. దివ్య రథంలో సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ చేశారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి లక్ష్మీనరసింహస్వామికి నాలుగో విడత చందన సమర్పణ జరుగుతోంది.
స్వామివారిని పెద్దఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. స్వామివారి వైభవం చూసి భక్తులు తరించారు. అంచనాకు మించి భక్త జన సందోహం తరలివచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. కుటుంబ సమేతంగా గిరి ప్రదక్షిణలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆలయ అధికారుల ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు. ఏటా గిరి ప్రదక్షిణకు భక్తుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. విశాఖ జిల్లా వాసులు, రాష్ట్ర ప్రజలపై సింహాచల అప్పన్న అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు.
గిరి ప్రదక్షిణ సందర్భంగా విశాఖలోని పలు రహదార్లు జనంతో కిక్కిరిసిపోయాయి. భక్తులు లక్షలాది మంది తరలివచ్చి గిరిప్రదక్షిణలో పాల్గొంటున్నారు. తొలి పావంచా నుంచి అడవివరం, హనుమంతవాక, అప్పుఘర్, ఇసుకతోట, సీతమ్మధార, నరసింహనగర్, మాధవధార, ఎన్ఏడీ జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, గోశాల మీదుగా మళ్లీ తొలిమెట్టు వరకు మొత్తంగా 32 కిలోమీటర్ల మేర భక్తులు గిరిప్రదక్షిణ చేస్తున్నారు. గిరిప్రదక్షిణ సాగే మార్గంలో ప్రతి 500 మీటర్లకు ఒక కౌంటర్ ద్వారా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు.
సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి పరిశీలిస్తున్నారు. మునుపెన్నడూ లేనంత భక్తుల రద్దీ ఈ ఏడాది ఉందని ఆలయ అధికారులు తెలిపారు. అయితే ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశినాడు సింహాచలం గిరి ప్రదక్షిణ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొంటారు.
గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల కోసం ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పాలు, పళ్లు, ఫలహారాలను అందిస్తున్నాయి. గిరిప్రదక్షిణ చేసే భక్తులకు ఉపశమనం కలిగించేందుకు..సత్యసాయి సేవా దళ్ సభ్యులు ఎన్ఏడీ కూడలి సమీపంలో కాళ్లకు మర్థన చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు సేవ చేస్తే మాధవుడికి సేవ చేసినట్టేనని తెలిపారు. దేవస్థానం ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సంస్థల సేవలు బాగున్నాయన్నారు. నేడు సింహాచల వరాహ లక్ష్మి నరసింహస్వామికి నాల్గో విడత చందన సమర్పణతో గిరి ప్రదక్షిణ పూర్తవుతుందని ఆలయ అర్చకులు తెలిపారు.
వైభవంగా సింహాచలం గిరిప్రదక్షిణ - భారీగా పాల్గొన్న భక్తులు - Giri Pradakshina Celebrations 2024
సింహాచలంలో వైభవంగా వరద పాయసం మహోత్సవం - Varada Payasam Mahostavam