Sickle Cell Disease in Telangana : ప్రాంతమేదైనా కాలానికి అనుగుణంగా విజృంభించే డెంగ్యూ, మలేరియా, అతిసారం, టైఫాయిడ్ లాంటి వ్యాధులు అందరికీ తెలిసినవే. కానీ వాటికి భిన్నమైనది సికిల్‌సెల్ అనిమీయా వ్యాధి. రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, ములుగు, మంచిర్యాల, జయశంకర్‌భూపాలపల్లి, వికారాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో సికిల్ సెల్ వ్యాధి ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ నిర్ధారించింది.
Sickle Cell Disease Effect : మనిషిలో సహజంగా గుండ్రంగా ఉండే ఎర్రరక్త కణాలు సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తుల్లో కొడవలిని పోలినట్లుగా ఉంటాయి. కొడవలిని పోలినట్లుగా ఉన్నందునే ఇది సికిల్‌సెల్ వ్యాధిగా గుర్తింపు పొందింది. ఎర్రరక్త కణాల సాధారణ జీవిత కాలం 12 రోజులైతే, సికిల్ సెల్ కణాల జీవితకాలం 20 నుంచి 25 రోజులు. కణాలు కొడవలిలా వంపుతిరిగి ఉండటంతో శరీరంలోని అవయాలన్నింటికీ రక్త ప్రసరణ జరిగేందుకు వీలుండదు. ఫలితంగా ఎర్రరక్త కణాల తయారీలో స్తబ్దత ఏర్పడి రక్తహీనతకు దారితీస్తుంది. సకాలంలో గుర్తించకపోతే రోగి వివిధ రకాల జబ్బుల బారినపడి ప్రాణాపాయ స్థితికి చేరే అవకాశం ఉంటుంది.
'ఆ ఏజ్ గ్రూప్ వాళ్లకు ఎక్కువగా షుగర్, బీపీ- 50శాతం పెరిగిన మరణాలు' - Deaths With Health Issues
Sickle Cell Disease Awareness Camp : రెండు రకాలుగా పిలవబడే సికిల్‌సెల్‌లో మొదటిది క్యారియర్ అంటే వ్యాధి లక్షణాలు బయటపడకుండా ఆరోగ్యంగా కనిపించేవారు. రెండోది డిసీజ్డ్ అంటే వ్యాధిగ్రస్థులై జబ్బులతో బాధపడేవారు. వ్యాధి ప్రబలకుండా సమూలంగా నియంత్రించాలంటే వ్యాధి కారకమైన క్యారియర్ మరో క్యారియర్‌తో వివాహాలు చేసుకోకుండా సాధారణ వ్యక్తులతో చేసుకోవాలి. ఇలా చేస్తే 2047 నాటికి సికిల్‌సెల్ ఎనీమియా లేని దేశంగా అవతరించవచ్చని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. దానికోసం క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆదిలాబాద్‌లో నేడు రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తోంది.
"సికిల్ సెల్ వ్యాధి జన్యుపరమైనది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. డిసీజ్ రకానికి చెందిన వ్యాధిగ్రస్తుడులో లక్షణాలు కనిపిస్తాయి. మరోకటి క్యారియర్ ఆ జన్యువులు క్యారీ చేస్తాడు. ఎలాంటి సమస్య ఉండదు. సికిల్ సెల్ క్యారియర్ అదే క్యారియర్‌తో పెళ్లి కాకుండా చూస్తే వ్యాధిని అరికట్టవచ్చు." - డా. నరేందర్ రాఠోడ్, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్
Sickle Cell Disease Symptoms : ఏజెన్సీ, మైదాన ప్రాంతాలు అనే తేడా లేకుండా ప్రజల్లో అవగాహన తీసుకురావాలంటే ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకుసాగాల్సి ఉంటుంది. అక్షరాస్యతా శాతం తక్కువగా ఉండే ఏజెన్సీ ప్రాంత ప్రజల్లో నమ్మకం కలిగించాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.