Shawarma Cases in Telangana : సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటలోని గ్రిల్ హౌస్ షాపులో షవర్మ తిని పలువురు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన చోటుచేసుకుంది. అందులో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురికాగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. గత నెలలో ఇదే షాపులో షవర్మ తిన్న పలువురు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పాటు ఆసుపత్రి పాలయ్యారు. దీంతో ఆహార భద్రత అధికారులు గ్రిల్హౌస్ షాప్‌ను తాత్కాలికంగా మూసివేయగా తిరిగి రెండు రోజుల క్రితం తెరిచి వ్యాపారాన్ని సాగిస్తున్నారు.
ఇదే క్రమంలో ఓల్డ్ అల్వాల్ సూర్య నగర్‌కు చెందిన రాజు, బాల సుబ్రహ్మణ్యం వేరు వేరుగా వెళ్లి రెండు రోజుల క్రితం గ్రిల్ హౌస్‌లో షవర్మ తిన్నట్లు తెలిపారు. షవర్మ తిన్న కొన్ని గంటల వ్యవధులలో వాంతులు, విరోచనాలు, కడుపులో మంటగా ఉండటంతో స్థానిక ఆసుపత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి ఆహార విక్రయశాలల పట్ల ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని వెంటనే మూసివేయాలని బాధితులు కోరారు.
గతంలోనూ ఇదే మాదిరి : అల్వాల్ ప్రాంతానికి చెందిన లోకేశ్, శరత్, గోవిందరాజ్, వర్ధినిలు నెల రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు డాక్టర్లను సంప్రదించడంతో వారు సంచలన విషయం వెల్లడించారు. బాధితులు తిన్న షవర్మ పూర్తిగా పాడైపోయి, కలుషితమైందని తెలిపారు. అందువల్ల వారికి మరుసటి రోజు నుంచి వెంటనే విరేచనాలు, వాంతులు, ఒళ్లు నొప్పులు, చలి జ్వరం లాంటివి వచ్చాయన్నారు. బయట ఇలాంటి ఆహారం తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. కల్తీ ఆహారం వల్ల శరీరంలో తీవ్రమైన అనర్థాలు జరుగుతాయని చెప్పారు. లేదంటే అనారోగ్యంతో అవస్థలు పడాల్సి వస్తోందన్నారు.
కల్తీ ఆహారం, పాడైపోయిన షవర్మ లాంటి వాటిని విక్రయిస్తున్న దుకాణాన్ని మూసివేయాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇదే గ్రిల్హౌస్ షవర్మ దుకాణంలో గతంలో కూడా ఇదే తరహాలో పలువురు ఆసుపత్రి పాలయ్యారని బాధితులు పేర్కొన్నారు. ఆహార భద్రత అధికారులు(ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్) ఇటీవల తనీఖీలు నిర్వహించి నెల రోజుల పాటు షాపును సీజ్ చేశారని స్థానికులు చెప్పారు. అయినా మళ్లీ రెండ్రోజుల నుంచి తెరచి వ్యాపారం సాగిస్తున్నారని తెలిపారు.
ఆ హోటల్లో షవర్మా తిన్నారా? అయితే మీరు ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది!