Birth Certificates in Telangana : ఈ రోజుల్లో పుట్టిన పిల్లలకు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్ ఉండాలి. అలాగే మరణించిన వారికి మరణ ధ్రువీకరణ పత్రం రకరకాలుగా అవసరముంటుంది. పిల్లలు పాఠశాలలకు వెళ్లాలంటే ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ లేదని చెబితే స్కూళ్లలో చేర్చుకోవడం లేదు. ఈ విషయం తెలిసినా కొన్ని ప్రైవేటు హస్పిటల్స్ అలసత్వం వైఖరిని వీడటం లేదు. జనన, మరణ రిపోర్టులను ఎప్పటికప్పుడూ మున్సిపాలిటీలు, నగరపాలికలకు అందించాల్సి ఉండగా కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు తీవ్ర జాప్యం చేస్తున్నారు.
కరీంనగర్‌లోని నగరపాలికతో పాటు జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మాతాశిశుతోపాటు ప్రైవేటు హస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు సైతం అధికంగానే ఉన్నాయి. నగరంలో సుమారుగా 120 ప్రైవేటు ఆసుపత్రులు ఉండగా ఇందులో 50 సూపర్ స్పెషాలిటీ హస్పిటల్స్ ఉన్నాయి. క్రమం తప్పకుండా ఆన్‌లైన్‌లో జనన, మరణ వివరాలను ఈ హస్పిటల్స్ నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ కేవలం 25 ఆసుపత్రులే వారి దగ్గర ప్రసవాలు చేయించుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేస్తున్నారు. మల్టీ స్పెషాలిటీల్లో ఎక్కువగా మరణాలకు సంబంధించిన కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. జన్మించినా, మరణించినా వివరాలను మున్సిపాలిటీలకు పంపించాలి.
అయిదు రోజుల్లో వివరాలు చేరాల్సిందే : ప్రతీ జననం, మరణం వివరాలను రిపోర్టుగా తయారుచేసి నేరుగా కాని, ఆన్‌లైన్‌లో కాని అయిదు రోజుల్లో పుర, నగరపాలికకు పంపించాలి. ఆ తర్వాత తీసుకొచ్చి ఇస్తే దానికి ఆసుపత్రి యజమాన్యం సంబంధిత కమిషనర్‌కు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. పుట్టిన, మరణించిన వివరాలను సరైన విధంగా ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేస్తే ఆ వివరాలను పురపాలక శాఖ తమ వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. దాని ఆధారంగానే మీ-సేవా, ఈ-సేవా కేంద్రాలలో దరఖాస్తు చేస్తే నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్లను పొందడానకి వీలుంటుంది.
ఆసుపత్రులకు ప్రత్యేకంగా లాగిన్లు : తెలంగాణ ప్రభుత్వం 2022 ఏప్రిల్ నుంచి ఆసుపత్రులే నేరుగా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ప్రత్యేక లాగిన్లు కేటాయించారు. పుట్టిన పిల్లలకు, చనిపోయిన వారి బంధువులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ నిబంధనను అమల్లోకి తీసుకువచ్చారు. అయినా కరీంనగర్‌లో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఉలుకు పలుకు లేకుండా ఉన్నాయి. ప్రధానమైన రెండు ఆసుపత్రులు కనీసం లాగిన్లను కూడా తీసుకోకపోవడం గమనార్హం. సర్టిఫికెట్ల కోసం బాధితులు ఈ ఆసుపత్రుల చుట్టూ రోజుల కొద్ది తిరగాల్సి వస్తోంది.
ఆన్‌లైన్‌లో లేకపోతే కష్టాలే
- పుట్టిన పిల్లలకు నెల రోజుల వ్యవధిలో ఆసుపత్రి నుంచి వివరాలను అందాయే లేదో మున్సిపాలిటీలో చెక్ చేసుకుంటే సమస్యలే ఉండవు.
- తల్లిదండ్రుల పేర్లతో ఆన్‌లైన్‌లో వివరాలు అప్లోడ్ అయినట్లయితే అవసరమున్న సమయంలో బర్త్ సర్టిఫికెట్స్ తీసుకోవచ్చు.
- సంవత్సరం లోపు అయితే ఆసుపత్రి నుంచి తీసుకొచ్చిన రిపోర్టు, నోటరీతో దరఖాస్తు చేయాలి. ఒక వేళా సంవత్సరం దాటితే వివరాలను లేనట్లుగా దరఖాస్తు చేస్తే సరిపోతుంది.
- ఆర్డీవో ద్వారా సర్టిఫికెట్లను తీసుకోవడానికి తహసీల్దార్ పేరుతో ఒక అర్జీ పెట్టుకోవాలి. దీనికి ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగుల సంతకాలు, ఐడీ కార్డులు, నోటరీలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
- విచారణ చేపట్టి, ధ్రువీకరించేంత వరకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. దీనికోసం ఏకంగా నెల రోజులకు పైగా సమయం పడుతుంది. దీంతో ప్రజల ఇతర పనులకు ఇబ్బంది కలుగుతోంది.
ప్రైవేటు ఆసుపత్రులు కచ్చితంగా రూల్స్, రెగ్యూలెషన్స్ పాటించాలి. నిర్లక్ష్యం వహించే ఆసుపత్రుల వివరాలను సేకరించి నిరభ్యంతర పత్రం నిలిపివేస్తాం. అవసరమైతే నోటీసులు జారీ చేస్తాం- చాహత్ బాజ్‌పాయ్, కరీంనగర్ నగరపాలిక కమిషనర్
బర్త్, డెత్ సర్టిఫికెట్స్ కోసం కేంద్రం CRS యాప్- ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?