Medak Road Accident Today : మెదక్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఆరుగురు మృత్యువాతపడగా, మరో ముగ్గురు తీవ్రగాయాలై ఆసుపత్రి పాలయ్యారు. చేగుంట మండలం వడియారం వద్ద బైపాస్ రోడ్డుపై ఇవాళ తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.
ఘటనలో 100 మేకలు మృత్యువాత : మధ్యప్రదేశ్‌కు చెందిన యజమానులు మేకల లోడుతో హైదరాబాద్‌కు వెళ్తుండగా, ముందు వెళ్తున్న మరో లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారని, మృతుల్లో ముగ్గురు కార్మికులు కాగా, ఇద్దరు యజమానులు ఉన్నారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ సహా ముగ్గురిని గాంధీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కాగా ఈ ఘటనలో 100 వరకు మేకలు మృత్యువాత పడ్డాయని సమాచారం.
Dead Body Stuck in a Car Under Lorry : మరో ఘటనలో ఎదురుగా వస్తున్న అడవి పందిని తప్పించబోయి నిలిచి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కౌడిపల్లి మండలం తునికి గేటు వద్ద గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతుడు జక్కపల్లి గ్రామానికి చెందిన మహేశ్ గౌడ్ (31)గా పోలీసులు గుర్తించారు.
కుటుంబీకులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం, నర్సాపూర్ మండలం జక్కపల్లి గ్రామానికి చెందిన మహేశ్ గౌడ్ అర్ధరాత్రి 12 గంటలకు నర్సాపూర్ నుంచి సొంత పనుల నిమిత్తం తునికి గ్రామానికి కారులో వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కారులో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు.
ఎంత ప్రయత్నించినా లారీ కిందకు దూసుకుపోయిన కారు రాకపోవడంతో జేసీబీని పిలిపించి, మూడు గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు కారు బయటకు తీశారు. కారు లారీ కిందకు దూసుకెళ్లడంతో నుజ్జునుజ్జు అయింది. కాగా కారు డోరు పగులగొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య మల్లీశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో 13మంది మృతి- ఆగి ఉన్న లారీని ఢీకొన్న టెంపో!