New triple IT's in Telangana : బాసరలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక, వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ)కు అనుబంధంగా మరో రెండు కొత్త క్యాంపస్‌లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త ట్రిపుల్ ఐటీలను నెలకొల్పుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల మంత్రివర్గ ఉప సంఘంలోనూ వాటి ఏర్పాటుపై చర్చ జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒక్క ప్రాంగణాన్నైనా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల నుంచి ఐటీ నిపుణులు తయారు కావాలన్న ఉద్దేశంతో 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన మూడు ట్రిపుల్ ఐటీల్లో బాసర ఆర్‌జీయూకేటీ ఒకటి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో బాసర ట్రిపుల్ ఐటీ మిగిలింది. గ్రామీణ విద్యార్థుల నుంచి పోటీ అధికమైనందున ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మరో ప్రాంగణాన్ని నెలకొల్పాలని విద్యావేత్త ఐఐటీ రామయ్య ఎన్నో ఏళ్లుగా కోరుతూ వచ్చినా అది నెరవేరలేదు. బాసర ఆర్‌జీయూకేటీలో ప్రతి ఏటా 1500 మంది ప్రవేశాలు పొందుతున్నారు.
ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కావడంతో బాసర ట్రిపుల్ ఐటీ 9 వేల మందికి పైగా విద్యార్థులతో కిక్కిరిసిపోతోంది. విద్యారంగంలో సంస్కరణలపై ఇటీవల మంత్రి శ్రీధర్‌బాబు ఛైర్మన్‌గా మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. ఇందులో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నాలుగు ప్రతిపాదనలను సమర్పించినట్లు తెలుస్తోంది. మరో రెండు ఆర్‌జీయూకేటీ క్యాంపస్‌లను ప్రారంభించడం వాటిలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం లాంటి ప్రతిపాదనలు అందులో ఉన్నాయి.
ప్రస్తుతం బాసర ఆర్‌జీయూకేటీలో సంప్రదాయ ఇంజినీరింగ్ కోర్సులు మాత్రమే ఉన్నాయి. ఇవే కాకుండా వాటికి అదనంగా బీటెక్ బయో టెక్నాలజీ, బయో మెడికల్, బయో ఇన్‌ఫర్‌మేటిక్స్, ఫార్మా టెక్నాలజీ వంటి ఇంజినీరింగ్, బయో సైన్స్ వంటి మల్టీ డిసిప్లినరీ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. పూర్తిగా గురుకుల ప్రాంగణాలు కావడంతో ఒక్కో దానికి కనీసం 100 ఎకరాల భూమి, రూ.500 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దక్షిణ తెలంగాణకే ప్రాధాన్యం! : ఉత్తర తెలంగాణలో ఒక ప్రాంగణం ఉన్నందున ఎన్నికల హామీ మేరకు మరో రెండింటిని దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోంది. ఒక ప్రాంగణాన్ని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటుచేసే అవకాశం ఉంది. మరొకటి ఖమ్మం లేదా నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయవచ్చని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒక ప్రాంగణాన్ని వచ్చే విద్యా సంవత్సరం(2025-26)లో తాత్కాలికంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐ, పాలిటెక్నిక్‌ల సిలబస్ : సీఎం రేవంత్ - CM Revanth On Govt ITI