High alert in Chhattisgarh-Telangana over Maoist PLGA week : ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దుల్లోనీ అటవీ ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టులు పీఎల్జీఏ నిర్వహించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులోని అటవీ ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్ప-వద్దిపాడు ప్రధాన రహదారి రొట్టెంత వాగు సమీపంలో ఆజాద్ పేరుతో ఈ నెల 1న బ్యానర్లు వెలిశాయి. ఆపరేషన్ కగార్, బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మించి గెరిల్లా పోరాటం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో ఆరోజు నుంచి భద్రతా బలగాలు, పోలీసులు అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఒకేరోజు ఇద్దరు మాజీ సర్పంచులను హత్య చేశారు. మరోవైపు జీడిపల్లి బేస్ క్యాంప్‌పై మావోయిస్టుల మెరుపు దాడికి దిగారు. బీజాపూర్ భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య గత రాత్రి నుంచి భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. బీజాపూర్ జిల్లాలోని పమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం జీడిపల్లి-2 క్యాంపు భద్రతా బలగాలు కూంబింగ్‌ను ప్రారంభించాయి. బేస్ క్యాంప్ ఔటర్ కార్డన్‌లో భద్రతపై మోహరించిన సైనికులతో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. మావోయిస్టుల నుంచి నిరంతర కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పులకు దీటుగా భద్రతా బలగాలు సమాధానం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
9న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు : మరోవైపు ఈ నెల తొమ్మిదిన రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చినట్లు మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖను విడుదల చేశారు. ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చినట్లు లేఖలో రాశారు. డిసెంబర్ 1న ములుగు జిల్లా ఏటూరునగరం మండలం చల్పక గ్రామ పంచాయతీ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. నవంబర్ 31న ఒక అనుచరుడుని నమ్మి వెళ్లిన మావోయిస్టులకు అన్నంలో మత్తుమందు కలిపి హత్య చేశారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.
దాడులను ప్రజలు, ప్రజా స్వామికవాదులు, మేధావులు ఖండించాలని లేఖలో మావోయిస్టులు రాశారు. అయితే అటు భద్రతా బలగాలకు ఇటు మావోయిస్టులకు జరుగుతున్న ఈ భీకర ఎదురు కాల్పులు దాడుల్లో అమాయక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం గ్రామాల్లో తనిఖీలు అటు మావోయిస్టుల నుంచి బెదిరింపుల నేపథ్యంలో ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ ఆదివాసీలు కాలం గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
అడవుల్లో అలజడి - ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హతమార్చిన మావోయిస్టులు - భయాందోళనలో గిరిపుత్రులు