CM Revanth Reddy At Sri Ujjain Mahankali Bonalu 2024 : లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం సందడిగా మారింది. తెల్లవారుజాము నుంచే తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మక వాతావరణం వెల్లివిరుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. తెల్లవారుజామున అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. సాకలు సమర్పించి, విశేష నివేదన చేశారు. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహంకాళి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి వైభవంగా నిర్వహిస్తుందన్నారు. అమ్మవారి బోనాన్ని అలంకరించి అంగరంగ వైభవంగా ఉత్సవాలను ప్రారంభించినట్లు తెలిపారు. అందులో భాగంగా నేడు తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించానని పేర్కొన్నారు.
ఉజ్జయిని మహంకాళికి బోనాల శోభ- ఆలయ కథేంటో తెలుసా? రంగం అంటే ఏంటి? - Ujjain Mahankali Bonalu
తెల్లవారుజామున 3 గంటల నుంచే ఇక్కడ బోనం సమర్పించడానికి అక్కాచెల్లెళ్లు అందరూ వస్తారని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసిందని మంత్రి స్పష్టం చేశారు. ఆషాఢ మాసంలో బోనాలు ప్రారంభమవుతాయని, మొదట గోల్కొండ జగదాంబిక అమ్మవారి నుంచి ప్రారంభమయ్యే జాతర, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు నిర్వహిస్తారని తెలిపారు. వచ్చే 28 తేదీన గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని దేవాలయాల్లో జాతర ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 200 వందల సంవత్సరాల చరిత్ర ఉందని ఎంపీ లక్ష్మణ్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బోనాల పండుగా జరుగుతుందని తెలిపారు. దిల్లీకి సైతం బోనాల పండుగ విస్తరించిందని లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. గతంలో సైతం ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమ్మవారిని దర్శించుకున్నారని గుర్తుచేశారు. అంతటి శక్తిగల ఉజ్జయిని ఆలయంలో నేడు బోనాల పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ - వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు - TG GURU PURNIMA CELEBRATIONS 2024