Scouts and Guides Organization Training for Students in Kadapa : విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా తర్ఫీదు ఇస్తోంది 'స్కౌట్స్ అండ్ గైడ్స్' సంస్థ. భారత సైనికులు ప్రాణాలకు తెగించి ఏ విధంగా సరిహద్దుల్లో రక్షణ కల్పిస్తారో అదేవిధంగా భావితరాలను దేశసేవలో భాగం చేసేలా సిద్ధం చేస్తున్నారు. అసలు ఈ సంస్థలో శిక్షణ ఎలా ఇస్తారు? విధివిధానాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
1907లో బెడెన్ పావల్ అనే ఇంగ్లాండ్ సైనికాధికారి స్కౌట్ సంస్థను స్థాపించారు. ఇంగ్లాండ్‌లో ఆరంభమైన స్కౌట్ 1909లో 'భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్' పేరుతో మనదేశంలో పురుడుపోసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ 276 శిక్షణా కేంద్రాలతో సేవలందిస్తోంది. రాష్ట్రంలోని విజయనగరం, కడపలో మాత్రమే 'భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్' ప్రాంతీయ శిక్షణ కేంద్రాలున్నాయి. విద్యార్థులకు బాల్యం నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఎంతగానో కృషి చేస్తోంది. విపత్తులు సంభవించినప్పుడు విద్యార్థులు ఏ విధంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి, మ్యాప్ ద్వారా దారులు గుర్తించడం, డేరాలు వేసుకోవడంపై తర్ఫీదు ఇస్తున్నారు.
పాఠశాల స్థాయిలోనే ప్రవేశ, ప్రథమ, ద్వితీయ సోపాన పరీక్షలు ఉంటాయి. వీటిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు జిల్లాస్థాయిలో తృతీయ సోపాన పరీక్షల కోసం తర్ఫీదు ఇస్తున్నారు. ఇందులో భాగంగా కడప స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంతీయ కార్యాలయంలో తృతీయ సోపాన పరీక్షల శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఒక్కో బ్యాచ్‌కు 5 రోజుల చొప్పున విడతల వారీ తర్ఫీదిస్తున్నారు. దేశ సేవ చేయాలనుకునే వారికి ఈ సంస్థలో చేరడం గొప్ప అవకాశమని విద్యార్థులంటున్నారు.
తృతీయ సోపాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందిస్తారు. ఆ తర్వాత వారిలో మెరికలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయిలో రాజ్య పురస్కార్ శిక్షణకు పంపిస్తారు. ఇందులోనూ ఉత్తీర్ణత సాధించిన వారికి రాష్ట్రపతి చేతులమీదుగా రాష్ట్రపతి పురస్కార్ అందిస్తారు.'-ప్రమీల, జిల్లా కార్యదర్శి
ఉమ్మడి కడప జిల్లాలోని 207 పాఠశాలల్లో 6 వేల 400 మంది విద్యార్థులు ప్రస్తుతం స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో చేరారు. ఈ సంస్థలో పని చేస్తున్న విద్యార్థులకు ఇంజినీరింగ్, నీట్ తోపాటు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించే విధంగా 2022లో రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 27 విడుదల చేసింది. సర్టిఫికెట్స్ కలిగిన విద్యార్థులకు పోటీ పరీక్షల్లో 0.5 శాతం రిజర్వేషన్ కూడా ఉంది.
ధర్మవరం యువకుల ప్రతిభ - 'సేద్యం' చిత్రానికి 6 అంతర్జాతీయ పురస్కారాలు - AWARD TO SEDYAM MOVIE