Comprehensive Family Survey in Telangana : రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే 78 శాతం పూర్తి అయిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 90,56,383 నివాసాల్లో సర్వే పూర్తయిందని తెలిపారు. సర్వే మొత్తం పూర్తి చేసిన తొలి జిల్లాగా ములుగు నిలిచింది. అలాగే జనగామ జిల్లా 99.9 శాతం సమగ్ర సర్వే పూర్తైంది. సర్వేను సకాలంలో పూర్తి చేసేలా జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే నల్గొండ జిల్లాలో 99.7 శాతం పూర్తి అయింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వే రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది.
కామారెడ్డి, మంచిర్యాల, యాదాద్రి, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, గద్వాల, మహబూబ్‌నగర్, మెదక్, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, నారాయణపేట, భూపాలపల్లి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 90 శాతానికి పైగా సర్వే పూర్తయినట్లు తెలుస్తోంది. హనుమకొండ(75.7 శాతం), మేడ్చల్ మల్కాజిగిరి(71.2 శాతం) మినహా మిగలిన జిల్లాల్లో 80 శాతానికి పైగా సర్వే చకచకా పూర్తయింది.
పట్టణాలలో కొంత వెనుకంజ: జీహెచ్‌ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) పరిధిలో కూడా సర్వే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. గురువారం నాటికి జీహెచ్‌ఎంసీ పరిధిలో 25,05,517 ఇళ్లను సర్వే చేయాల్సి ఉండగా 15,17,410 నివాసాల సర్వే పూర్తి అయింది. ఇక్కడ 60.60 శాతంగా ఉందని లెక్కించారు. మరింత త్వరగా వంద శాతం లక్ష్యాన్ని సాధించే సంకల్పంతో అధికార యంత్రాంగం పనిచేస్తుంది.
ఈ కులగణన ప్రక్రియ పూర్తయిన తర్వాత వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను ఖరారు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను త్వరితగతిన పూర్తిచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. అదే మాదిరిగా ఉద్యోగాలలో కూడా ఇదే మాదిరి రిజర్వేషన్లు కల్పించి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. దీనిపైనే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కూడా ముడిపడి ఉంది. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై తీర్పు వెలువరించిన నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.
సొంతూళ్లలోనే కుటుంబ వివరాలు వెల్లడిస్తాం - ఎన్యూమరేటర్లకు చుక్కలు చూపిస్తున్న జనాలు
ఇంటికి వెళితే ఉండరు - ఆస్తి వివరాలు అడిగితే చెప్పరు - ఎన్యూమరేటర్లకు తప్పని సర్వే అష్టకష్టాలు