Funds For Telangana Singareni in Union Budget 2024 : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణలోని సింగరేణి గనుల సంస్థకు రూ. 1600 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపుల్లో రూ. 50 కోట్లు తగ్గాయి. హైదరాబాద్‌లోని ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్‌కు రూ.352.81 కోట్లు కేటాయించారు. దీంతో గతం కంటే ఇది రూ.12 కోట్లు అధికం. దేశంలో అణు ఇంధన కార్యక్రమాన్ని కొనసాగించడానికి అవసరమైన ఖనిజాన్వేషణ కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. హైదరాబాద్ ఐఐటీకి రూ.122 కోట్లే కేటాయించారు. ప్రతి సంవత్సరం విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టుల కింద ఈ సంస్థకు నిధులు కేటాయిస్తూ వస్తున్నారు.
హైదరాబాద్ ఐఐటీకి రూ.122 కోట్లే : గత ఏడాది బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించినా, అంచనాల సవరణ నాటికి రూ.522 కోట్లకు పెంచారు. దీంతో పోలిస్తే ఈసారి కేటాయింపులు రూ.400 కోట్లు తగ్గాయి. హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థకు రూ.10.84 కోట్ల నిధులు కేటాయించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.80 కోట్లు తక్కువ. ఇన్‌కాయిస్‌కు రూ.28 కోట్లు ఇచ్చారు. ఇది గత బడ్జెట్ కంటే రూ.కోటి అధికం. తెలంగాణ, ఏపీల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు ఈసారి ప్రత్యేకంగా కేటాయింపులు జరపలేదు. వాటి కేటాయింపులను సెంట్రల్ యూనివర్సిటీ గ్రాంట్లలో విలీనం చేశారు. ఇకపై సెంట్రల్ యూనివర్సిటీల గ్రాంట్ల ద్వారానే గిరిజన వర్సిటీలకు నిధులు కేటాయిస్తారు.
ఏపీలోని సంస్థలకు ఇలా : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర బడ్జెట్‌లో రూ.620 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.63 కోట్లు కోతపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం విశాఖలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీకి రూ.168 కోట్లు కేటాయించారు. ఈసారి రూ.78 కోట్లు పెంచారు. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌కు రూ.150 కోట్లు కేటాయించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.126 కోట్లు తక్కువ.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాజెక్టులకు విదేశీ ఆర్థిక సంస్థల ద్వారా నిధులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల ప్రాజెక్టుకు ఏఐఐబీ నుంచి రూ.150 కోట్లు, ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు 2వ దశకు జపాన్ ప్రభుత్వం నుంచి రూ.300 కోట్లు, ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆపరేషన్‌కు ఐబీఆర్‌డీ నుంచి రూ.300 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రహదారులు, వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టుకు ఎన్‌డీబీ నుంచి రూ.650 కోట్లు కేటాయించారు.
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం : కేటీఆర్ - KTR On Central Budget Funds