Rotten Meat Sales Rise in Hyderabad : కోడి మాంసం దుకాణాల్లో కోళ్ల మెడ, రెక్కల కొనలు, కాళ్లు, ఇతర శరీర భాగాలను చెత్తగా పడేస్తుంటారు. అలాంటి వ్యర్థాలన్నింటినీ సేకరించి, నిల్వ ఉంచి కోడి మాంసం అంటూ విక్రయిస్తున్న ముఠాలు నగరంలో పెరుగుతున్నాయి. పాతబస్తీ కేంద్రంగా కుళ్లిన మాంసాన్ని హోల్‌సేల్‌గా విక్రయిస్తున్న రెండు సంస్థలను జీహెచ్‌ఎంసీ ఇటీవల గుర్తించింది. ఆయా కేంద్రాలు నగరంలోని అన్ని మూలాలకూ నాసిరకం, కుళ్లిన మాంసాన్ని సరఫరా చేస్తున్నాయని తేలింది. వారి దగ్గర మాంసం కొని జనావాసాల్లో గోదాములను ఏర్పాటు చేసుకుని బార్లు, పలు రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు విక్రయిస్తున్న దుకాణాలను సీజ్ చేయడంతో ఈ తతంగం బట్టబయలైంది.
పాతబస్తీలో అధికం : కోడి మాంసాన్ని కొందరు చర్మంతో తీసుకుంటే, మరికొందరు చర్మంలేని ముక్కలను తీసుకుంటారు. లెగ్‌పీస్, చెస్ట్‌పీస్, వింగ్స్ ప్రత్యేకంగా కొనుగోలు చేస్తుంటారు. ఆన్‌లైన్ డెలివరీ సంస్థలు సైతం కోడి, పొట్టేలు, మేక మాంసాన్ని గ్రాముల లెక్కన అమ్ముతుంటారు. అలా మాంస వ్యర్థాలు పెద్దఎత్తున పోగయితే వాటిని పాతబస్తీలో గోదాములు ఏర్పాటు చేసి హోల్‌సేల్ ధరలకు అమ్ముతున్నారు. మరికొన్ని పౌల్ట్రీ సంస్థలు కర్రీ కట్ పేరుతో చిన్న ముక్కలను తయారు చేసి చిన్నపాటి సంచుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.
కళేబరాలను నిల్వ ఉంచి విక్రయాలు : కోళ్ల పెంపక కేంద్రాల్లో కళేబరాలను కొందరు ముక్కలుగా చేసి విక్రయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాంటి కళేబరాలను రెండు రోజులు నిల్వ ఉంచి ముక్కలు చేసి, హోల్‌సేల్ మార్కెట్లో అమ్ముతున్న వారు కూడా నగరంలో ఉన్నారు.
మరువక ముందే మరో ఘటన : బేగంపేటలోని ఓ బస్తీ నుంచి స్థానిక కార్పొరేటర్ ద్వారా జీహెచ్‌ఎంసీకి ఓ కోడి మాంసం విక్రయ కేంద్రంపై ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే పశువైద్య విభాగం, ఆహార కల్తీ నియంత్రణ విభాగాల అధికారులు తనిఖీలు నిర్వహించారు. చెన్నై, బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మాంసాన్ని హోల్‌సేల్‌లో కొని జనావాసాల్లోని ఓ గదిని అద్దెకు తీసుకుని నిల్వ చేస్తున్న ఓ వ్యాపారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఈ కేంద్రాన్ని మూసివేయించారు. ఈ ఘటన మరువక ముందే బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో మరో ఘటన వెలుగు చూసింది. కుళ్లిన కోడిమాంసం విక్రయ కేంద్రంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించగా 700 కేజీల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.