Role of AICC in Selection Of New PCC President : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, సీఎం రేవంత్ రెడ్డినే పీసీసీ అధ్యక్షుడు కావడంతో నూతన సారథి ఎంపిక విషయంలో ఏఐసీసీ కసరత్తు పటిష్టంగా జరిగినట్లు తెలుస్తోంది. ఆశావహులు డజను మంది వరకు ఉన్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సంబంధాలు, పార్టీని బలోపేతం చేసేందుకు కష్టపడే మనస్తత్వం కలిగిన నాయకుడిని ఎంపిక చేయాలని మొదటి నుంచి ఏఐసీసీ భావిస్తోంది.
అయితే అనూహ్యంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ మూడు వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు పీసీసీ నాయకత్వం కోసం యత్నించారు. కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపుతో కోర్ కమిటీ సభ్యులైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీలు దిల్లీ చేరుకుని కాంగ్రెస్ పెద్దలు ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్‌లో భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న నాయకుల పేర్లను కాంగ్రెస్ పెద్దల ఎదుట పెట్టారు.
TPCC President Selection Issue : చివరకు బీసీ సామాజిక వర్గానికే నూతన పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆ తరువాత సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో బీసీలల్లో ఎవరు పీసీసీ అధ్యక్షుడుగా ఉంటే ప్రభుత్వంతో కలిసిమెలిసి పని చేసుకుపోతారని వేరువేరుగా అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాస్కీ, పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్‌ల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది. దీంతో ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంది. మధుయాస్కీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పలుకుబడి కలిగిన నాయకుడు. ఈయన తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. రెండు సార్లు ఎంపీగా పని చేసిన ఈయన అన్ని రకాలుగా అర్హుడని తేల్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ పీసీసీ ఛీప్‌గా మహేశ్‌కుమార్ గౌడ్ : అదే సమయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న మహేశ్‌కుమార్ గౌడ్ ఎన్‌ఎస్‌యుఐ, యువజన కాంగ్రెస్ విభాగాల్లో వివిధ హోదాల్లో పని చేయడమే కాకుండా ఈయన పలుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదేవిధంగా పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడుగా పని చేసిన ఈయన ప్రస్తుతం పీసీసీ సంస్థాగత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. ఇటీవల ఆయన ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. వీటన్నింటిని పరిశీలించిన తరువాత అధిష్ఠానం మహేశ్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ముఖ్యనేతల అభిప్రాయాలు సేకరించాకే నిర్ణయం : అధికారంలో కాంగ్రెస్ పార్టీనే ఉండడతో ఇద్దరు బీసీలే కావడంతో ఎవరు అయితే ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఉంటారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని కూడా మరొకసారి పార్టీ అధిష్ఠానం అభిప్రాయం తెలుసుకోవడం, ప్రజల్లో, పార్టీ నాయకుల్లో వీరిద్దరిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎవరు అవుతారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీనాయకులతో, కార్యకర్తలతో, అందరితో సఖ్యతగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకుపోతారు అనే విషయంపై ఆరా తీసినట్లుగా తెలిసింది. నిర్ణయం తీసుకున్న తరువాత చేసేదేమీ లేదని, అందుకే లోతైన అధ్యయనం కోసం ప్రకటన చేయడంలో జాప్యం జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరగకుంటే రెండు వారాల కిందటనే నూతన అధ్యక్షుడి పేరు ప్రకటన పూర్తై ఉండేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ పీసీసీ ఛీప్‌గా మహేశ్‌కుమార్ గౌడ్ - AICC ANNOUNCE TELANGANA PCC CHIEF