Roads Damage in Adilabad : ఆదిలాబాద్ జిల్లాలోని లాండసాంగ్వి రహదారి వాహనాదారులకు చుక్కలు చూపిస్తోంది. మట్టిలో వాహనాలు కురుకుపోయి అవస్థలు పడుతున్నారు. జైనథ్ మండలం భోరజ్ నుంచి బేల మీదుగా 353-బీ జాతీయ రహదారి వెళ్తుంది. మార్గమధ్యలో తర్నం వద్ద ఉన్న వంతెన, గతేడాది ఫిబ్రవరిలో కుంగిపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఆదిలాబాద్‌లోని సీసీఐ పక్క నుంచి లాండసాంగ్వి, నిరాల మీదుగా జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ 15 కిలోమీటర్ల రోడ్డును అందుబాటులోకి తీసుకొచ్చారు.
వాహనాల రాకపోకలకు అనువుగా రహదారిని 9 మీటర్ల వెడల్పుతో విస్తరించేందుకు కేంద్రం రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసింది. 2023 జులైలో టెండర్ ప్రక్రియ పూర్తిచేసి గుత్తేదారుకు అప్పగించింది. అప్పటి నుంచీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్డును తవ్వి, మట్టి పోసి వదిలేయడంతో వాహనాదారులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జైనథ్, బేల మండలాల ప్రజలు ఈ రహదారి గుండానే నిత్యం ఆటోలలో మహరాష్ట్రకు వెళ్తుంటారు.
"రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. వర్షాకాలం కావడంతో వాహనాలు మట్టిలో కురుకుపోతున్నాయి. కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశాడు. అధికారులు చూసీచూడనట్లుగా వ్వవహరిస్తున్నారు. కేవలం 9 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు 2 గంటలకు పైగా సమయం పడుతోంది. ప్రభుత్వం స్పందించి రోడ్డును నిర్మాణాన్ని పూర్తిచేయాలి". - స్థానిక వాహనదారులు
ఈ రోడ్డులో 9 కిలోమీటర్లు ప్రయాణించడానికి, దాదాపు 2 గంటల సమయం పడుతోందని స్థానికులు చెబుతున్నారు . గుంతలతో ప్రమాదాలకు గురవుతున్నామని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో పెద్దపెద్ద వాహనాలు రానీయకుండా అధికారులు 24 గంటలూ పోలీసులను కాపాలాగా ఉంచుతున్నారు. బస్సు, ఆటో వంటి వాహనాలును మాత్రమే అనుమతించి లారీ, ట్రక్కు వంటి పెద్ద వాహనాలను తిరిగి వెనుక్కి పంపిస్తున్నారు. కేంద్రం నిధులు మంజూరు చేసినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగలేదని స్థానిక శాసనసభ్యుడు పాయల్ శంకర్ ఆరోపించారు.
"రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ఇచ్చిన రూ. 42కోట్ల నిధులను ఉపయోగించలేదు. నేను హైదరాబాద్‌లో ఆర్ అండ్ బీ ఈఎన్సీతో మాట్లాడాను. రోడ్డును నిర్మించాలని విజ్ఞప్తి చేశాను". - పాయల్‌శంకర్, ఆదిలాాబాద్ ఎమ్మెల్యే