Heavy Rains in Telangana : వాయుగుండం ప్రభావంతో కురిసిన జోరువాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు చివురుటాకులా వణికాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం వివరాలు సేకరిస్తుండగా, పార్టీ అధిష్ఠానం సూచనలతో ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో భారీ వర్షానికి దెబ్బతిన్న వంతెనలు, రహదారులను ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యుడు డాక్టర్ రామచంద్రనాయక్ పరిశీలించారు. కుండపోత వర్షాలతో ఇబ్బంది పడుతున్న ఏజెన్సీ గ్రామాల ప్రజలను మంత్రి సీతక్క పరామర్శించారు. కొత్తగూడ, గంగారం మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి, భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష : తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పెన్‌గంగ నదిని ఆదిలాబాద్ కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సరిహద్దు గ్రామాల్లోని పరిస్థితిపై ఆరా తీశారు. భారీ వర్షంతో మంచిర్యాల జిల్లా మందమర్రిలో అంత్యక్రియల నిర్వహణ భారంగా మారింది. అంతిమయాత్రకి వెళ్లేందుకు దారిలేక వర్షంలో మృతదేహంతో మృతుని కుటుంబ సభ్యులు వాగు దాటేందుకు నానా కష్టాలు పడ్డారు.
నిర్మల్ జిల్లాలోని భారీవర్షాల వల్ల నష్టాలపై ఖానాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు ముందు కడెం జలాశయాన్ని సందర్శించిన మంత్రి పరిస్థితిపై ఆరా తీశారు. ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.
వరదల్లో చిక్కుకున్న యువకుడు : ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రజలు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్నిచర్యలు చేపట్టిందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సంగారెడ్డి జిల్లా లోని మంజీర డ్యాంను పరీశిలించిన ఆయన వర్షాలకు ప్రాణనష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మెదక్ జిల్లాలోని పోచారం ప్రాజెక్టులో చిక్కుకున్న యువకులను పోలీసులు రక్షించారు.
ప్రాజెక్టు చూసేందుకు వెళ్లి వరద ఉద్ధృతి పెరగడంతో ఐదగురు యువకులు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు తాడు సహాయంతో వారిని బయటికి తెచ్చారు. భారీవర్షాలతో నిజామాబాద్ జిల్లా శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కి వరద పోటెత్తుతోంది. బ్యాక్ వాటర్‌తో బోధన్ మండలంలోని బిక్నల్లి శివారులోని పంటలు నీటమునిగి చెరువులని తలపించాయి.
"కడెం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయని పరిష్కారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే దాదాపు రూ.10 కోట్ల మరమ్మతులు చేపడుతున్నారు. ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పాటు అవుతుందని ఎవరూ అనుకోలేదు. భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాలు వాటి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు చేపడతాం." - శ్రీధర్ బాబు, మంత్రి
అధికారుల క్షేత్రస్థాయి పర్యటన : ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ వర్షాలు జోరుగా కురిశాయి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డలో వర్షాల కారణంగా కట్టమీద శివాలయం సమీపంలో 30 నుంచి 60 అడుగుల మేర చెరువుకట్ట తెగిపోయి పలుగ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 50గ్రామాల వారధైన రామడుగులోని వంతెన ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ వరద ప్రభావిత ప్రాంతాలని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్నిరకాల ఆదుకుంటామని హామీఇచ్చారు.
మహేశ్వరం నియోజకవర్గం జలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌సాగర్ లోతట్టు ప్రాంత పరిస్థితులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో బాధితులని ఆదుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు ముందుకొచ్చారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ఒక్కో బాధిత కుటుంబానికి పదివేల ఆర్థిక సాయంతో పాటు వారానికి సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
నిండుకుండల్లా మారిన జలాశయాలు - భారీ వర్షాలతో సంతరించుకున్న జలకళ - Huge Floods in Dams
రాష్ట్రాన్ని నిండా ముంచిన జడివాన - జలదిగ్బంధంలో పట్టణాలు, గ్రామాలు - Heavy Rains Across The State