Ratan Tata Association With Visakhapatnam In AP : విలువలతో కూడిన టాటా గ్రూప్ సంస్థలను దిగ్గజ స్థాయికి తీసుకెళ్లిన క్రెడిట్ రతన్ టాటాకే దక్కుతుంది. టాటా సన్స్ గౌరవ ఛైర్మన్‌గా ఉన్న రతన్ టాటా బుధవారం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయిన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
కేవలం వ్యాపారం చేయడమే కాదు దేశ ప్రజలకు మేలు చేసేలా సేవా కార్యక్రమాలనూ టాటా సంస్థ భారీ స్థాయిలో నిర్వహిస్తోంది. టాటా సంస్థను ఆదరిస్తున్న భారతీయులకు అపద సమయాల్లో వివిధ రూపాల్లో సాయం చేస్తోంది. వాటిలో కొన్ని ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ అమలు చేశారు. పేదల బతుకులు బాగు చేసే కార్యక్రమాలు, ఆరోగ్యాన్ని కాపాడే వైద్య సంస్థలూ ఆ జాబితాలో ఉన్నాయి.
'విశాఖపట్నం స్వచ్ఛ నగరం. ఈ ప్రాంతానిపై ఇప్పటివరకు దృష్టి సారించలేదు. ముంబయి వెళ్లాక వైజాగ్‌లో పెట్టుబడులు, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి(ఏయూ)కు ఏవిధంగా సాయపడగలమో ఆలోచిస్తాం' అని 2018 డిసెంబరు 10న ఏయూలో జరిగిన సమావేశంలో రతన్ టాటా తెలిపారు.
ఉప్పు నుంచి ఉక్కు వరకు : ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ‘టాటా’ సంస్థ ఉత్పాదనలు తప్పకుండా ఉంటాయి. ఉప్పు నుంచి ఉక్కు వరకు టీ, ఆహారం, రవాణా, ఉద్యోగం, వినోదం, వస్త్రాలు, ఆభరణాలు, ఉక్కు, గృహాలంకరణ సామగ్రి ఇలా ఏది చూసినా ప్రతి రంగంలోనూ టాటా అడుగు స్పష్టంగా కనిపిస్తుంది.
‘రతన్ టాటా’ చొరవతోనే క్యాన్సర్ సేవలు : అగనంపూడిలో రతన్ టాటా కృషితో ఏర్పాటు చేసిన హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి నేడు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, ఇతర ప్రాంత ప్రజలకు ఆరోగ్యవరప్రదాయినిగా ఉంది. రతన్ టాటా ఛైర్మన్‌గా ఉన్న ముంబయి టాటా స్మారక కేంద్రం నోడల్ ఏజెన్సీగా వ్యవహరించడానికి ముందుకు రావడంతోనే విశాఖపట్నంలో ఆసుపత్రి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. కేంద్ర అణుశక్తి మంత్రిత్వ శాఖ తొలుత కోల్‌కతా, త్రివేండ్రం, ఇతర నగరాల్లో ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించినప్పటికీ టాటా సంస్థ ప్రతినిధులు విశాఖ వైపే మొగ్గు చూపారు. 2009లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎకరా రూ.1.50 లక్షల చొప్పున మొత్తం 76 ఎకరాలను కేటాయించింది.
2014లో క్యాన్సర్ ఆసుపత్రి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఓవైపు పనులు జరుగుతుండగానే మరోవైపు తాత్కాలికంగా కంటైనర్లలో వైద్య సేవలు ప్రారంభించారు. కట్టడాల నిర్మాణ పని పూర్తికావడంతో వైద్య విభాగాలను తరలించారు. ప్రస్తుతం పక్కా భవనాల్లో ఎంతో మంది పేదలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలతో చికిత్స అందిస్తున్నారు.
గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపిన టాటా ట్రస్ట్ : అల్లూరి జిల్లాలో గిరిజన రైతుల జీవనోపాధి మెరుగుదలకు టాటా ట్రస్టు ‘విజయవాహిని’ సంస్థ ద్వారా ఎంతో కృషి చేస్తోంది. గిరిజనుల సగటు ఆదాయం రూ.1.50 లక్షలకు చేర్చాలన్న దృఢ సంకల్పంతో 43 గ్రామాల్లో టాటా ట్రస్టు ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లా పరిధిలోని అచ్యుతాపురం, రాంబిల్లి, మునగపాక మండలాల్లో ఎంపిక చేసిన 32 గ్రామాల్లో టాటా ట్రస్ట్, ఏషియన్ పెయింట్స్ సంయుక్తంగా విజయవాహిని ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవలందిస్తున్నాయి. మహిళలకు పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పోషణ సఖీలను నియమించారు. ఆ కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాలను ఇస్తున్నాయి. పోషణ సఖీలకు నిరంతరం అవగాహనకు న్యూట్రిషన్‌లో బీఎస్సీ పూర్తిచేసిన వారిని మండలానికి ఒకరు చొప్పున నియమించారు.
గొప్ప మానవతావాది రతన్‌టాటా : ‘గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్న రతన్‌టాటాతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల మహోత్సవంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. 2008లో భారత ప్రభుత్వం నుంచి చికిత్స, పరిశోధన రంగాల్లో పద్మశ్రీ పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతులమీదుగా అందుకున్నా. అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన హై టీ వేడుకల్లో రతన్‌టాటాను కలిసి మాట్లాడడం మరచిపోలేని గొప్ప అనుభూతి. టాటా మెమోరియల్ ఆసుపత్రి వారి దాతృత్వానికి చిహ్నంగా ఉంది.’- కూటికుప్పల సూర్యారావు
విశాఖకు గిఫ్ట్‌గా టీసీఎస్ : దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ విశాఖలో పెట్టుబడులు పెట్టనున్నట్లు బుధవారం ప్రకటించడంతో జిల్లా వాసుల్లో కొత్త ఆశలు చిగురించాయి. అయితే అప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారనే వార్త మరి కొద్ది గంటల్లోనే తెలిసి అంతటా తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. ఆయన చివరి దశలో ఉన్నప్పుడే టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) రూపంలో విశాఖకు బహుమతి ఇచ్చారని పలువురు పేర్కొంటున్నారు.
టీసీఎస్ ప్రతిపాదన అప్పుడే జరిగాందా? : రతన్ టాటా విశాఖపట్నం వచ్చిన సమయంలో నగరంలో టీసీఎస్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన వచ్చిందని పలువురు చెబుతున్నారు. ఆయన రాకకు గుర్తుగా ఇక్కడ టీసీఎస్ నెలకొల్పాలని అప్పటి ప్రజాప్రతినిధులు టాటా దృష్టికి తీసుకెళ్లారు. యాదృచ్ఛికంగా ఆయన అస్తమయానికి కొన్ని గంటల ముందు టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు టాటా సంస్థ సుముఖత వ్యక్తం చేసిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
విశాఖలో రతన్ టాటా అడుగు జాడలు : 2018 డిసెంబరు 10 ఆంధ్రయూనివర్సిటీ పూర్వవిద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డు ఏయూ కనెక్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి రతన్ టాటా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తాజాగా టాటా సన్స్ ప్రస్తుత ఛైర్మన్ చంద్రశేఖరన్ గత ఏడాది ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరైనప్పుడు విశాఖలో టీసీఎస్ ఏర్పాటుకుగల అవకాశాలను వివరించారు. దానిపైనే తాజాగా గురువారం ప్రకటన కూడా వెలువడింది.
వ్యాపారం ఎలా చేయాలో తెలుసా? రతన్ టాటా చెప్పిన ఆర్ధిక సూత్రాలు ఇవే!
'శ్రీవారికి' రతన్ టాటా విలువైన కానుక - ఏటా ఎంత ఇస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!