Ramoji Rao Biography : 'నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక' అంటూ మన గుమ్మంలోకి వచ్చేశారు. మనసు వాకిట నిల్చున్నారు. ఆపై హృదయ సింహాసనం మీద మనసున్న మారాజులా ఆశీనులయ్యారు. తెలుగు వారి జీవితాల్లో భాగమయ్యారు. అంతకు ముందే మార్గదర్శిగా వచ్చారు. ఇదేదో ఒకనాటి అచ్చట, ముచ్చట కాదు. ఎన్నో వసంతాల విశేషం. ఆయన మార్గదర్శి, ఈనాడు, ఈటీవీ వ్యవస్థాపకులు, ప్రపంచంలోనే అతిపెద్ద సినీ నగరం రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాత, స్ఫూర్తిదాత, ఐదక్షరాల మంత్రాక్షరి, అద్భుతాల పంచాక్షరి రామోజీరావు.
సామాన్యుడిగా మన మధ్య ఉండి శిఖరమంత ఎదిగిన సుప్రసిద్ధులు రామోజీరావు. రామోజీరావు అంటే ఐదక్షరాల పేరు మాత్రమే కాదు. విజయానికి ఓ తారకమంత్రమని, ఆయన పట్టిందల్లా బంగారమేనని సమకాలీన సమాజం విశ్వసిస్తున్న సమయం. ఆయన అరవై రెండేళ్ల వ్యాపార ప్రపంచం రామోజీ గ్రూప్ మార్గదర్శకులు. దిశానిర్దేశకులు. తెలుగు ధరిత్రిపై అర్ధ శతాబ్ద పత్రికా రంగ చరిత్ర. 30 ఏళ్ల ‘ఈఠీవీ రాజసం. నలభై సంవత్సరాల ఉషాకిరణాల సినీ యశస్సు రామోజీరావు. విశ్వసనీయతే పెట్టుబడిగా, విలువల కట్టుబడితో పాతికేళ్ల నాడు సినీ మంత్రనగరి ఫిల్మ్‌సిటీ సృష్టికర్త తపస్వి రామోజీరావు.
అక్షర తపస్వి జననం : నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో రాజకీయ చైతన్యం వెల్లివిరిసిన కృష్ణా తీరం గుడివాడ పట్టణం. అక్కడికి సమీపాన ఓ పచ్చని పల్లెటూరు పెదపారుపూడి. అక్కడ ఓ వెచ్చని మమతల గూడు చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మగారిల్లు. 1936వ సంవత్సరం. నవంబర్ 16. పెద్ద అక్షరాలతో రాసుకోవాల్సిన తేదీ. ఆ దంపతుల ఇంట వరాల బిడ్డ రామయ్య పుట్టిన రోజు అది. ఇద్దరు అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత ఎన్నో ఏళ్లకు జన్మించిన గారాల బిడ్డ. తాతయ్య పేరు రామయ్య. ఆ చిన్నారికి పెట్టారు. కానీ బాల రామయ్య. ఘటికుడు. ఆధునికుడు. తన ప్రాథమిక బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పాడు. అలా రామయ్య రామోజీరావు అయ్యారు. ఇంట్లో అంతా ఆశ్చర్యపోయారు. బాలుని ప్రతిభకు మురిసిపోయారు. అలా తన పేరు తనే పెట్టుకున్న రామోజీలో విలక్షణత, సృజనాత్మకత నాడే మొగ్గతొడిగాయి.
పెదపారుపూడి అటు కోవెల గంటల సవ్వడి. దైవ స్తోత్రాలు. ఇటు పక్షుల రెపరెపల గానాలు. మరో దిశగా పచ్చటి పంటచేలు. చెరువు ఒడ్డు. రామోజీ ప్రకృతి ప్రేమకు, కళాత్మక ఆలోచనలకు పల్లె కాన్వాసుగా నిలిచింది. చిత్రకారుడు కావటానికి నేపథ్యమైంది. భవిష్యత్తు దర్శనం చేసింది. ప్రాథమిక విద్య పూర్తయ్యాక పైచదువులకు రామోజీ గుడివాడ వెళ్లారు. మున్సిపల్ స్కూల్లో 8వ తరగతిలో చేరారు. 11వ తరగతికి సమమైన అప్పటి Sixth Farm చదివారు.
రామోజీకి చదువు కంటే, కళలు, రాజకీయాలపై ఆసక్తి మిన్నగా ఉండేది. తన మాటల్లో నిశిత దృష్టి. సునిశిత పరిశీలన కనపడేది. గుడివాడ బజారులో నడచి వెళ్తుంటే వరుసగా ఒకే వ్యాపార దుకాణాలు కనపడేవి. స్టీల్ సామాన్ల కొట్లయినా, ఫ్యాన్సీ షాపులైనా.. ఏవైనా వరుసగా అవే వ్యాపారాలు. ఇదేమిటి? ఇలా అందరూ ఒకే వ్యాపారం చేసే బదులు వేర్వేరు వ్యాపారాల్లో రాణించి లాభపడవచ్చు కదా? అని మిత్రులతో అనేవారు. అనుకరణలు వద్దని, సొంత ఒరవడే శ్రేయస్కరమని చెప్పేవారు. ఇందుకే కావచ్చు. రామోజీరావు చేస్తున్న ప్రతి వ్యాపారంలో ఓ నవ్యత, వైవిధ్యం కనపడతాయి.
మలుపు తిప్పిన సంఘటనలు : 1951లో రామోజీ హైస్కూలు చదువు ముగిసింది. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. అనంతరం అక్కడే బీఎస్సీ పూర్తయ్యింది. చదువుకునే రోజుల్లో రామోజీరావు కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడు. చండ్ర రాజేశ్వరరావు, సుందరయ్య తన ఆరాధ్య నేతలు. సత్యాగ్రహ సిద్ధాంతకర్త , ప్రజాధన పరిరక్షణకు ఉద్దేశించిన ధర్మ కర్తృత్వ (Dhrma Kartruthwa) సిద్ధాంత ఆవిష్కర్త మహాత్మా గాంధీ రామోజీకి ఎంతో ఇష్టం. ఆయన దళిత జనోద్ధరణ అంటే మరీమరీ ఇష్టం. అన్నట్లు.. ప్రతి మనిషి జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలు ఉంటాయి. రామోజీరావుకు అలాంటి అనుభవ నేపథ్యమే ఉంది.
డిగ్రీ తర్వాత భిలాయ్‌లో ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. పిలుపు వస్తుందన్న గట్టి నమ్మకం క్రమంగా సడలింది. నిరాశే మిగిలింది. రామోజీ మనసులో సంఘర్షణ ప్రారంభమైంది. తనే పది మందికి పనిచ్చేలా ఎదగాలని భావించారు. కానీ కొంత విరామం తీసుకున్నారు. ఈ దశలో రామోజీరావు దిల్లీలో మళయాళీ వ్యాపారవేత్త అనంత్ నెలకొల్పిన వాణిజ్య ప్రకటనల సంస్థలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు. తర్వాత కొద్ది కాలానికే అమెరికా అవకాశం తలుపు తట్టింది. తనలో అంతర్మథనం సాగింది. అయినా అయిన వాళ్లను, జన్మభూమిని విడిచి వెళ్లటానికి మనసొప్పలేదు. మాతృదేశంలోనే ఉండిపోవాలని నిశ్చయించారు.
రామోజీరావు వివాహం : 1961 ఆగస్టు 19. రామోజీ జీవితంలో మోహనరాగం. యుక్త వయసు రావటంతో పెళ్లికి ఇంట్లో ఒత్తిడి పెరిగింది. కృష్ణాతీరంలో పెనమలూరులో తాతినేని వారి అమ్మాయి రమాదేవితో చూపులు కలిశాయి. రామోజీరావు-రమాదేవి వివాహం బెజవాడ కన్యకా పరమేశ్వరి మందిరంలో జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ. అది అమ్మమ్మ పేరు. తనపేరు కొంచెం ఆధునికంగా ఉండాలని ఆమె అభిలాష. స్కూల్లో చేరినప్పుడు తన పేరు రమాదేవిగా రాయించారు. అటు రామయ్య, ఇటు రమణమ్మ తమ పేర్లు మార్చుకోవటం కాకతాళీయమే. వివాహానంతరం సతీమణి రమాదేవితో కలిసి రామోజీరావు దేశ రాజధానికి మకాం మార్చారు. దక్షిణ దిల్లీ కరోల్ బాగ్‌లో నివసించారు. దిల్లీలో ఆర్టిస్టుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు.
కృషి ఉంటే ఘన ఫలితాలే సాధించవచ్చన్న నమ్మకం కుదిరింది. నాయకత్వ లక్షణాలు వచ్చాయి. వ్యాపార దక్షత పెరిగింది. ముఖ్య విషయాలలో స్పష్టత వచ్చింది. నిరంతర అధ్యయనం, నిశిత పరిశీలనతో ప్రజాహిత వ్యాపారం చేపట్టాలని రామోజీ భావించారు. తను చేసే పని పదిమందికీ ప్రయోజకంగా ఉండాలని అభిలషించారు. 1962లో పెద్దకుమారుడు కిరణ్ పుట్టిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చారు. అదే ఏడాది రామోజీ దిల్లీలో ఉద్యోగపర్వం ముగించారు. వ్యాపార రంగ ప్రవేశానికి, మార్గం నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు.
1962లో మార్గదర్శి స్థాపన : సమస్యలు ఉరుముతుంటాయి. అవసరాలు తరుముతుంటాయి. ఇంటి కోసం చేసిన రుణం ఎప్పుడు తీర్చుకుంటారని వెంటపడుతుంది. అబ్బాయి, అమ్మాయి విదేశీ చదువు, వివాహం. అనేకానేక అవసరాలు. అనివార్యాలు. అప్పు చేయాలంటే మనసొప్పదు. అభిమానం అడ్డువస్తుంది. ఆత్మగౌరవం వెనక్కి లాగుతుంది. ఏ బంగారం తాకట్టుపెట్టి అవసరాలు తీర్చాలి? ఏ ఆస్తిని అడ్డంపెట్టి బయటపడాలి? ఈ పరిస్థితిలో మార్పు తేవాలని రామోజీరావు నిశ్చయించారు. 1962 అక్టోబర్‌లో హైదరాబాద్ హిమాయత్ నగర్లో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ నెలకొల్పారు. నమ్మకమే పెట్టుబడిగా, విశ్వసనీయతే కట్టుబడిగా ఏర్పాటైన దిగ్గజ వ్యాపార సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్.‘మార్గదర్శి తోడుంటే.. ఆనందం మీవెంటే’..అనే నినాదం తర్వాత కాలంలో లక్షలాది ఖాతాదారులకు తారకమంత్రమైంది.
దేశంలోనే నంబర్ 1 చిట్ ఫండ్ : చిట్ ఫండ్ వ్యాపారం అంటే అదేదో మహిళల వ్యవహారం అని భావించిన రోజుల్లో రామోజీ రావు అలాంటి మాటలను ఖాతరు చేయలేదు. పట్టుదలతో ముందుకు సాగారు. వసూళ్లు, చెల్లింపులు కచ్చితంగా ఉండటంతో ఖాతాదారుల్లో విశ్వాసం ఏర్పడింది. సిబ్బంది క్రమశిక్షణ, అంకిత భావం, యాజమాన్య విశ్వసనీయత వల్ల సంస్థ శరవేగంగా అభివృద్ధి చెందింది. ఆర్థిక క్రమశిక్షణ, అంకితభావం, విశ్వసనీయత.. ఈ మూడూ మార్గదర్శికి మూడు మంత్రాక్షరాలు.1995లో రూ.100 కోట్ల వార్షిక టర్నోవర్ నేడు రూ.10,683 కోట్లు దాటిందంటే అది రామోజీ బ్రాండ్.
ఈరోజు మార్గదర్శి శాఖల సంఖ్య 113కు చేరింది. సంస్థలో ఉద్యోగులు 4,038 మంది సిబ్బంది ఉపాధి పొందుతున్నారు. చిట్స్ సభ్యుల సంఖ్య 2 లక్షల 23 వేల 710. రామోజీ దిశానిర్దేశంలో మేనేజింగ్ డైరెక్టర్ శైలజాకిరణ్ నేతృత్వంలో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే కర్ణాటక, తమిళనాడుకు వ్యాపారం విస్తరించింది. నేడు 113 శాఖలతో దేశంలోనే నెంబర్-1 చిట్ ఫండ్ సంస్థగా మారింది. రూ.20 వేల కోట్ల వార్షిక వ్యాపార లక్ష్యంగా పయనిస్తోంది. ఆరు దశాబ్దాలుగా మార్గదర్శి జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలో కోటిమంది చందాదారులున్నారు. మార్గదర్శి రాజకీయ శక్తులు సృష్టించిన సంక్షోభాన్ని అధిగమిస్తూ ఎదుగుతోంది. ఏ మాట రాకుండా సంస్థను నడపాలని మార్గదర్శి లక్ష్యంగా నిర్దేశించుకుంది.
2006 నవంబరులో దుష్టశక్తుల దాడులకు తెగబడినా, ఖాతాదారులు అండగా నిలిచారు. మార్గదర్శి నిబద్ధత, నిజాయతీ, అందించే సేవలు, పాటించే సేవలు, విలువలను విశ్వసించారు. ఆనాడు లభించిన ఆత్మవిశ్వాసంతో మార్గదర్శి ప్రగతిపథంలో దూసుకెళ్లింది. 2025 నాటికి మార్గదర్శి రూ.25 వేల కోట్ల వార్షిక టర్నోవర్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. నిపుణులైన సిబ్బంది సంఖ్యను భారీగా పెంచి విస్తరణ బాట పట్టిన మార్గదర్శికి జనాదరణ లభిస్తోంది. రామోజీ దార్శనికతపై మరింత గురి కుదిరింది. సంస్థతో ఖాతాదారుల బంధం మరింత బలపడింది.
Margadarsi Chit Fund : మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే. ఒక కార్మికుడు మార్గదర్శిలో చిట్ వేసి ద్విచక్రవాహనం కొనుక్కున్న వాణిజ్య ప్రకటన నిశ్శబ్దంగా మనసులు కొల్లగొట్టింది. ఈనాడు, ఈటీవీ ద్వారా రాజీలేని పోరుతో రామోజీరావు నాటి ప్రభుత్వ పెద్దలను ఢీకొన్నారు. రాజకీయశక్తులు ఆయన్ని లక్ష్యంగా చేసుకొని దుష్టపన్నాగాలకు వ్యూహరచన చేశాయి. 2006లో వైఎస్ ప్రభుత్వం భూదందాను ఈనాడు, ఈటీవీ ఎండగట్టాయి. ఔటర్ రింగ్ రోడ్డు డిజైన్‌ను మెలికలు తిప్పి, ఉద్దేశపూర్వకంగా నష్టపరిచిన చర్యలను తూర్పారపట్టాయి. ప్రజలు కష్టార్జితంతో సంపాదించుకున్న భూములపై రాజకీయ గద్దలు వాలాయి.
అప్పుడు 'పెద్దలా? గద్దలా?' శీర్షికతో ఈనాడు, ఇదే అంశంపై ఈటీవీలో పరిశోధనాత్మక కథనాలు వచ్చాయి. వైఎస్ ప్రభుత్వం మార్గదర్శిని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం సాగించింది. ఒక్క డిపాజిటర్ కూడా తమ డబ్బు కోసం రాలేదు. రామోజీరావు మీద, మార్గదర్శిపైనా సంపూర్ణంగా విశ్వసించారు. 2006లో తండ్రి, 2019 తనయుడు ముఖ్యమంత్రులుగా మార్గదర్శిని లక్ష్యంగా చేసుకొని ఎన్ని ఇబ్బందులు పెట్టినా రామోజీ అదర లేదు, బెదరలేదు, మడమ తిప్పలేదు. నిరంతర యుద్ధాలు చేస్తున్నారు. మరో దిశలో మార్గదర్శి విజయాలతో దూసుకెళుతూ దేశంలోనే నెంబర్ వన్ చిట్ ఫండ్ కంపెనీగా అవతరించింది.
అక్షరయోధుడికి పుష్పాంజలి - దేశవ్యాప్తంగా రామోజీరావుకు ఘననివాళులు - tributes to ramojirao