Rain in Telangana : హైదరాబాద్‌ను మరోసారి వర్షం కుదిపేసింది. మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లితో పాటు మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండిమైసమ్మ, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, మన్సూరాబాద్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిధిలో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. బోయిన్‌పల్లి, మారేడుపల్లి, బేగంపేట్, ప్యారడైజ్ ప్రాంతాల్లోపాటు చిలకలగూడ, అల్వాల్, జవహర్‌నగర్‌లో కురిసిన జోరు వాన రహదారులను ముంచెత్తింది.
అటు ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, అడిక్‌మెట్, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, బాగ్ లింగంపల్లి, కవాడి గూడ, దోమల గూడ, భోలక్ పూర్, మలక్‌పేటలోనూ వర్షం కురిసింది. ఆఫీసులు వదిలే సమయం కావడంతో రోడ్లపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. రెండురోజుల క్రితమే భారీవర్షంతో ట్రాఫిక్‌లో నరకం చూసిన వాహనదారులు మరోసారి తమ సహనాన్ని పరీక్షించుకున్నారు.
వనస్థలిపురంలో జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. చింతల్‌కుంట వద్ద వర్షపు నీరు చేరి చెరువును తలపించింది. పనామా- ఎల్బీనగర్ మధ్య వాహనాలు స్తంభించిపోయి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఎగువ నుంచి కురిసిన వర్షపు నీరు జాతీయ రహదారిపైకి చేరడం, దానికితోడు విస్తరణ పనుల మధ్య రోడ్డంతా వరదనీటితో నిండిపోయింది.
మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. సంగారెడ్డిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం రైతులను తీరని నష్టం తీసుకొచ్చింది. రంగారెడ్డి, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. ఖమ్మం, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కూడా రాత్రి 9 గంటల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరో వైపు భారీ వర్షం వల్ల రేపు జరగబోయే మ్యాచ్ రద్దు కాకుండా ఉప్పల్ స్టేడియం సిబ్బంది మైదానంలో పట్టాలు కప్పుతున్నారు.
Rain in Telangana For Two Days : రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. రేపు ఎల్లుండి కూడా ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు వస్తాయని వివరించింది. ఈరోజు ఆవర్తనం దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సముద్రమట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.