Rain in Hyderabad : రాష్ట్రంలో ఒకవైపు భానుడు భగభగమంటున్న తరుణంలో పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇవాళ హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వాన పడగా నగర శివారులోని భారీ వర్షం ముంచెత్తింది. దీంతో శ్రీశైలం జాతీయ రహదారిపై నాలుగు చోట్ల చెట్లు కులాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు- కందుకూరు మధ్య ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
వర్షం కారణంగా విరిగిపడిన చెట్లను తొలగించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమించారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో వాహనదారులు సైతం ఇబ్బందులకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో వర్షం పడగా కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. జిల్లాలోని మాచారెడ్డి మండలంలోని సోమారంపేట్, రత్నగిరి పల్లి, నెమలిగుట్ట తాండా, బంజేపల్లి గ్రామాలలో కురిసిన వడగళ్ల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. మార్కెట్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిముద్దయింది.
ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు నేలపాలయ్యాయి. పలు గ్రామాలలో ఇంటిపై కప్పులు, రేకులు గాలికి కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అకాల వర్షాలు కురవడంతో రైతులలో ఆందోళన నెలకొంది. వర్షానికి దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేసి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
తడిసిన ధాన్యం : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల వ్యాప్తంగా తీవ్రమైన ఈదురుగాలతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. బలమైన ఈదురు గాలులు వీయడంతో అధికారులు విద్యుత్‌ను నిలిపివేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి.
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం బస్తాలు, ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. బస్వాపూర్‌లో పశువుల పాక కూలి రెండు గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. నియోజకవర్గంలోని మార్కెట్ యార్డులో విక్రయించడానికి తెచ్చిన ధాన్యం తడిసి పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Grain loss in Rain : అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వము కొనుగోలు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన దుబ్బాక వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఇదికాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసింది. జహీరాబాద్ పట్టణంతో పాటు డివిజన్లోని ఝరాసంఘం, కోహిర్ మండలాల్లో భారీ వర్షం పడింది.
వర్షం కారణంగా జహీరాబాద్ పట్టణంలోని పలు లోతట్టు కాలనీలు జలమయంగా మారాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు రాష్ట్రంలో రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న మూడురోజుల్లో కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణపై అలకబూనిన వర్షం - 305 రోజుల్లో వాన కురిసింది 66 రోజులే - low rainfall in telangana