Rain in Hyderabad : ఇవాళ హైదరాబాద్‌లో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నగరంలోని మాల్కాజిగిరి, కాప్రాలోని ఈసీఐఎల్, కుషాయిగూడ, ఏఎస్ రావు నగర్, చర్లపల్లి పరిసర ప్రాంతాలలో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. నాగారం పురపాలక పరిధిలో ఉరుములు మెరుపులు కూడిన వర్షం పడగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు రాష్ట్రంలో నేడు రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Rain Alert in Telangana : అదే విధంగా కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమేణ 2 నుంచి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. రాగల మూడు రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.
నిన్న మన్నార్ గల్ఫ్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తులో కొనసాగిన ద్రోణి, ఈరోజు కోమరిన్ ప్రాంతం నుంచి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ శాఖ సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.
తెలంగాణపై అలకబూనిన వర్షం - 305 రోజుల్లో వాన కురిసింది 66 రోజులే - low rainfall in telangana