Huge Rush in Railway Stations and Bus Stands : దసరా పండగ సెలవుల నేపథ్యంలో చాలా మంది సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్, లింగంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు, జూబ్లీ బస్స్టేషన్లలో ప్రయాణికులతో రద్దీ నెలకొంది. కళాశాలలకు సైతం సెలవులివ్వడంతో ఊళ్లకు వెళ్లేవారితో బస్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడుపుతున్నప్పటికీ రద్దీ మాత్రం తగ్గడం లేదు. ప్రయాణికుల రద్ధీతో పిల్లాపాపలతో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సులు, రైళ్లు సంఖ్యను మరింత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. దసరా సెలవులు ప్రారంభమైన దగ్గర నుంచి ఇదే రద్దీ కొనసాగుతోంది.
దసరాకు ఆరువేల ప్రత్యేక బస్సులు : శనివారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌లో దేవగిరి ఎక్స్‌ప్రెస్ రాగానే ప్రయాణికుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. జనరల్ బోగీల్లో కాలుపెట్టే అవకాశం కూడా లేకపోవడంతో చాలామంది రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కారు. జూబ్లీ బస్టాండ్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారు భారీగా వచ్చారు. దసరాకు ఆరు వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించినా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అవసరమైతే 9,10,11 తేదీల్లో మరిన్ని బస్సులు నడుపుతామని అధికారులు వెల్లడించారు.
ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్న రైల్వేస్టేషన్లు : దసరా నేపథ్యంలో సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయాణికులు రైల్వైస్టేషన్కు చేరుకుంటున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తమ సొంతూళ్లలో బంధుమిత్రులతో కలిసి నిర్వహించుకోవడం కోసం ఉత్సాహంగా వెళ్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయినప్పటికీ ఇంకా చాలడం లేదు.
బస్టాండ్లకు భారీగా ప్రయాణికులు : మరి కొంతమంది ప్రైవేటు సంస్థల బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అవకాశంగా భావించి ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలు కూడా ప్రయాణికుల నుంచి భారీగా రుసుములు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం చొరవ చూపించి మరిన్ని బస్సులను, రైళ్లను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ పలు ప్రత్యేక సర్వీసులు తిప్పుతున్నప్పటికీ అవి ఇంకా సరిపడకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడుపుతామని అధికారులు చెబుతున్నారు.