Interstate Drug Peddlers Arrested in Hyderabad : రాచకొండ పోలీసులు హాష్ ఆయిల్ ముఠా గుట్టురట్టు చేశారు. పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్ వద్ద ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసి, రూ.కోటికి పైగా విలువైన 13.5 లీటర్ల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వంచుర్బ కొండబాబుకు మాదక ద్రవ్యాల సరఫరాలో భాగస్వామి అయిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో భారీగా డబ్బులు సంపాదించొచ్చనే ఆశతో వ్యవసాయాన్ని పక్కనపెట్టిన కొండబాబు, మత్తు దందాలోకి దిగాడు. అప్పటికే డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న అతని బంధువు వంచుర్బ బాలకృష్ణను జత చేసుకున్నాడు. ఇద్దరు కలిసి తక్కువ ధరకు హ్యాష్ ఆయిల్‌ను సేకరించి, అధిక ధరలకు విక్రయించే వారని పోలీసులు తెలిపారు.
మార్కెట్ రేటు రూ.14 కోట్లు! : కాలక్రమేణా హాష్ ఆయిల్ తయారీదారులు, సరఫరాదారులు అన్నీ వీరే అయ్యారని పోలీసులు వివరించారు. ఏపీలో గంజాయి సాగు చేసే ప్రాంతాల్లో సరకును సేకరించి, గంజాయితో పాటు వివిధ కెమికల్స్ వేసి మరిగించి, ఈ హాష్ ఆయిల్ తయారు చేసేవారని వెల్లడించారు. అయితే లీటరు హాష్ ఆయిల్ తయారీకి నిందితులు 40 కేజీల గంజాయిని వాడారన్న పోలీసులు, 13.5 లీటర్ల హాష్ ఆయిల్ తయారీకి దాదాపు 600 కేజీల గంజాయిని వినియోగించినట్లు తేలిందన్నారు. ఈ మొత్తాన్ని చిన్న చిన్న బాటిళ్లలో ప్యాకింగ్ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో గంజాయి మార్కెట్ రేటు ప్రకారం 13.5 లీటర్ల హాష్ ఆయిల్ విలువ సుమారు రూ.14 కోట్ల వరకు ఉంటుందని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు.
హాష్ ఆయిల్ : మత్తు కాదు.. అంతకుమించి
బెంగళూరులో ఎవరికిస్తున్నారు? బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి 14 కిలోల హాష్ ఆయిల్ కోసం ఆర్డర్ ఇవ్వగా, విశాఖ నుంచి నిందితులు హైదరాబాద్ మీదుగా బెంగళూరు తరలించేందుకు యత్నించారు. ఈ క్రమంలో పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్ వద్ద నిందితులు ఓ వ్యక్తికి హాష్ ఆయిల్ ఇచ్చేందుకు చూస్తుండగా, విశ్వసనీయ సమాచారంతో పోలీసులు డ్రగ్ పెడ్లర్లిద్దరినీ అరెస్టు చేశారు. డ్రగ్స్ తీసుకునేందుకు వచ్చిన వారు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు నిందితులకు హైదరాబాద్‌లో కూడా పలువురితో సంబంధాలు ఉన్నట్లు తేలిందన్నారు. అలాగే బెంగళూరులో ఈ డ్రగ్స్ ఎవరికి చేరవేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీపీ సుధీర్‌బాబు వివరించారు.
మీ సహకారం కావాలి : ఈ సందర్భంగా ఇటీవల తండ్రీకుమారులు మత్తు దందా చేస్తూ పోలీసులకు దొరికిన ఘటనను సీపీ సుధీర్‌బాబు గుర్తు చేశారు. ఈజీ మనీ కోసం కుటుంబసభ్యులు, బంధువులను కూడా నిందితులు మత్తు దందాలోకి లాగుతున్నట్లు వివరించారు. ఇలాంటి మాదక ద్రవ్యాల ముఠాలు దేశంలో చాలానే ఉన్నాయన్న ఆయన, వారిని కట్టడి చేసేందుకు ప్రజల సహకారం కావాలని కోరారు. మత్తు దందాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. హాష్ ఆయిల్ విక్రయించే ముఠా అరెస్ట్