Puppala Mamatha Got 5 Govt Jobs : ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే అంత తేలికైన విషయం కాదు. అందులోనూ ప్రభుత్వ కొలువులకు విపరీతమైన పోటీ నెలకొంది. కానీ, అవేమి తనని ఆపలేదు. కష్టపడి ఓపికతో చదివింది. ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. పోటీ పరీక్షల సన్నద్ధతకే ఎక్కువ సమయం కేటాయించి విజయ దుందుభి మోగించింది.
Multi Govt Jobs Gainers Success Story : ఈ యువతి పేరు పుప్పాల మమత. జగిత్యాల జిల్లా(Jagtial Dist) ల్యాగలరమర్రికి చెందిన యువతి సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు పుప్పాల భూమయ్య, రమ. మమతకు చదువు పట్ల ఉన్న ఆసక్తిని తల్లిదండ్రులు చిన్నతనంలోనే గుర్తించారు. ఆర్థిక సమస్యలు ఎదురైనా ఉన్నత చదువులు చదివేందుకు ప్రోత్సహించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన మమతకు చదువుకునే సమయంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి.
వాటిని అధిగమిస్తూ వచ్చిన యువతి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలని సంకల్పించుకుంది. కుటుంబానికి అండగా నిలవాలని దృఢనిశ్చయంతో మందుకు సాగింది. ఇంటర్‌లో వచ్చిన నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్‌తోనే డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. బీఈడీ, ఎంకామ్ పూర్తి చేసిన మమత సిరిసిల్లలోని గురుకుల డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకురాలిగా పని చేస్తోంది. విధి నిర్వహణలో భాగంగా విద్యార్థులకు కామర్స్ భోదిస్తూనే, సమయం దొరికినప్పుడల్లా పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది.
ఈ క్రమంలో ఇటీవల వెలువడిన గురుకుల ఫలితాల్లో 4 ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు గతేడాది టీఎస్‌పీఎస్సీ(TSPSC) నిర్వహించిన పరీక్షల్లో జూనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా ఎంపికైనట్లు చెబుతోంది. వరుసగా 5 ఉద్యోగాలకు ఎంపికవ్వడం వెనకాల కుటుంబ సభ్యుల ప్రోత్సహం ఎంతో ఉందని మమత అంటోంది. విద్యార్థులకు పాఠాలు చెప్పడం అంటే తనకెంతో ఇష్టమని, అందుకోసం ఉపాధ్యాయురాలిగానే కొనసాగుతానని వివరిస్తోంది. కామర్స్‌లో పీహెచ్‌డీ చేసి తనకంటూ ఒక ప్రత్యేక గర్తింపు తెచ్చుకోవాలని మమత భావిస్తోంది.
ఓయూ దిద్దిన వాచ్‌మెన్ కథ ఇది - కోచింగ్ లేకుండానే ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన, అందుకు కష్టపడేతత్వం మమతలో మెండుగా ఉన్నాయని, సహ ఉద్యోగి ఫౌజియా చెబుతోంది. రేయింబవళ్లు కష్టపడి చదివి కామర్స్‌లో డిగ్రీ లెక్చర్‌గా 16, జూనియర్ లెక్చరర్‌గా 6 ర్యాంకులతో పాటు టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన మున్సిపల్‌శాఖ పరీక్షల్లో 23వ ర్యాంకు సాధించిన మమత చూస్తే గర్వంగా ఉందని అంటోంది. బావిభారత విద్యార్థులను తీర్చిదిద్దటంలో తనవంతు పాత్ర పోషిస్తానంటోంది పుప్పాల మమత. ఆర్థిక ఇబ్బందులు, అసమానతలను అధిగమించి, 5 ప్రభుత్వ ఉద్యోగాలకు అత్యుత్తమ ర్యాంకులతో ఎంపికైన మమత టాలెంట్‌ను తారీఫు చేయాల్సిందే.
"ఇటీవల ప్రకటించిన టీజీటీ, పీజీటీ, జేఎల్, డీఎల్, టీఎస్‌పీఎస్సీ ఫలితాల్లో 5ఉద్యోగాలకు ఎంపికయ్యాను. వీటిలో డీఎల్ ఉద్యోగంలో చేరుతాను. నాకు చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయ ఉద్యోగం అంటే ఇష్టం. ఇష్టంతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చు". - పుప్పాల మమత, 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి
సర్కారు కొలువే లక్ష్యంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం - కోచింగ్ లేకుండా ప్రతిభ చూపిన గజ్వేల్ బిడ్డ
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మాజీ సర్పంచ్ - సక్సెస్ మంత్ర అదేనంట!